జిన్ పింగ్ కు మోడీ ఝలక్ : చైనా వదిలి భారత్ కు1000కి పైగా అమెరికన్ కంపెనీలు!

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 01:07 PM IST
జిన్ పింగ్ కు మోడీ ఝలక్ : చైనా వదిలి భారత్ కు1000కి పైగా అమెరికన్ కంపెనీలు!

చైనాలో కార్యకలాపాలు సాగిస్తోన్న అమెరికా ఉత్పత్తి సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలను భారత్ ప్రారంభించింది. కరోనా వైరస్ కారణంగా చైనా అంటేనే ట్రంప్ మండిపడుతున్న వేళ.. చైనాలోని అమెరికా కంపెనీలను భారత్‌ తీసుకొని రావడం కోసం మోడీ సర్కార్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. చైనా నుంచి బయటకు రావాలని భావిస్తోన్న 1000కి పైగా అమెరికన్ కంపెనీలను భారత్ సంప్రదించింది.

అమెరికా, జపాన్, చైనాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ ధరకే భూమిని సేకరించొచ్చని…నైపుణ్యం ఉన్న మానవ వనరుల లభ్యత కూడా అధికమని అధికారులు సంస్థలకు చెబుతున్నారు. కార్మిక చట్టాలను మార్చడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని కంపెనీలకు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యూహాన్ ల్యాబ్ లో సృష్టించబడింది అంటూ అమెరికా అధ్యక్షుడు బహిరంగంగానే చైనాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా కంప తెచ్చిపెట్టింది చైనాయేనని ట్రంప్ విమర్శల ధాటి పెంచుతున్నారు. కరోనా కంటే ముందునుంచే అమెరికా, చైనా మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు… కోవిడ్ దెబ్బకు మరింత దిగజారాయి.

చైనాపై ట్రంప్ విమర్శల వల్ల ప్రపంచ వాణిజ్యంలో డ్రాగన్ పరిస్థితి ఇరకాటంలో పడుతుంది.చైనాను నమ్మొద్దనే ధోరణి అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్నది. ముఖ్యంగా వైద్యరంగంలో చైనాతో దోస్తీ పెట్టుకోగూడదని అమెరికా భావిస్తున్నది. ఇది భారత్‌ కు ఓ అవకాశంగా పరిణమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కల్లోలంలో భారత్, అమెరికా మరింత దగ్గరయ్యాయి. ట్రంప్ కోరిన మలేరియా మందు బోలెడు ఇవ్వడం ద్వారా ఇండియా తన పలుకుబడిని గణనీయంగా పెంచుకున్నది. చైనా మీద మొఖం మొత్తిన అమెరికా కంపెనీలను రారమ్మని పిలిచేందుకు ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుందని భారత్ భావించింది.

గత ఏప్రిల్ నెలలో భారత ప్రభుత్వం…చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న 1000కి పైగా అమెరికన్ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. విదేశాల్లోని మన రాయబార కార్యాలయాలు ఈ విషయంలో అనుసంధాన కర్తలుగా పనిచేస్తున్నాయి. ఆలస్యం చేయకుండా అమెరికన్ కంపెనీలను సంప్రదించిన భారత సర్కారు..పలు ఇన్సెంటివ్ ‌లను ఆఫర్ చేసింది. 

కరోనా నేపథ్యంలో చైనాలోని వివిధ దేశాలకు చెందిన కంపెనీలు కూడా డ్రాగన్ దేశాన్ని వదిలిపెట్టేందుకు రెడీ అయ్యాయి. సంస్థలు ఒకే చోట తమ కార్యకలాపాలను కేంద్రీకరించొద్దని భావిస్తున్నాయి. చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి రప్పించడం కోసం జపాన్ ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. యూరోప్ దేశాలు కూడా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. 

వైద్య పరికరాలు సరఫరా చేసే దిగ్గజ సంస్థ అబ్బాట్ లేబరేటరీస్ తో సహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో పార్ట్ తయారీ సంస్థలకు భారత్ వస్తాయని మోడీ సర్కారు ఆశిస్తోంది. మెడ్‌ట్రోనిక్, అబోట్ ల్యాబోరేటరీస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను భారత్‌కు తరలించడం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే భారత్‌ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తుండటంతో.. చైనా నుంచి తమ ఉత్పత్తి యూనిట్లను తరలించడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

చైనా కన్నా కొంచెం వ్యయం ఎక్కువైనా అమెరికా, జపాన్ తదితర దేశాల కంపెనీలకు సొంతగడ్డకు తరలివెళ్లడం కన్నా భారత్ గిట్టుబాటుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో భారత్ కు దరిదాపుల్లోకి వచ్చే మరొక దేశం ఏదైనా ఉందంటే అది వియత్నాం. కానీ భారత్ కల్పించే స్థాయిలో రాయితీలు వియత్నాం కల్పించగలదా అనేది ప్రశ్న. వియత్నాం కన్నా భారత్ ఆకర్షణ కొంచెం ఎక్కువే ఉంటుంది.