PM On Mann Ki Baat : 10 రెట్లు ఎక్కువ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి..విజయనగరం మామిడిపండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని

కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు.

PM On Mann Ki Baat : 10 రెట్లు ఎక్కువ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి..విజయనగరం మామిడిపండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని

Pm On Mann Ki Baat

PM On Mann Ki Baat కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు. కానీ ఆ సమయంలో భారత వాయుసేన, రైల్వే శాఖలు, క్రయోజనిక్​ ట్యాంకర్​ డ్రైవర్లు తీవ్రంగా శ్రమించి సమయానికి ఆక్సిజన్​ను చేరవేయగలిగారని చెప్పారు. ఆక్సిజన్ తరలింపులో వారి సేవలు అసాధారణమైనవని ప్రధాని చెప్పారు. సాధారణ రోజుల్లో దేశంలో రోజువారీ మెడికల్​ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్​ టన్నులుగా ఉండేదని… ప్రస్తుతం అది పది రెట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్​ టన్నులకు చేరిందని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళా లోకో పైలెట్ శిరీషతో ప్రధాని మాట్లాడారు. ఆమె అనుభవాలను తెలుసుకున్నారు.

కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులు వందేళ్లకోసారి ఏర్పడుతుంటాయని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఎవరికీ తెలియదని ప్రధాని అన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలు కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్నారని చెప్పారు. ఇదివరకు తాము ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితుల్లోనూ వెన్ను చూపట్లేదని అన్నారు. తొలి విడతలో కరోనా వైరస్‌పై ఘన విజయాన్ని సాధించామని, అదే స్ఫూర్తితో ఈ రెండో దశనూ ఎదుర్కొందామని ప్రధాని పిలుపునిచ్చారు. ఫ్రంట్ లైన్ వర్కర్లను ఈ సందర్భంగా ప్రధాని మరోసారి అభినందించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాల్గొంటోన్న ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ప్రధాని ప్రశంసించారు. రోజూ 20 లక్షలకు పైగా దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగులు సాగుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో అవి నమోదు కావడంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. లక్షలాది ల్యాబ్ టెక్నీషియన్లు నిరంతరాయంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల తరహాలోనే వారి సేవలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ ప్రకాష్ అనే ఓ ల్యాబ్ టెక్నీషియన్‌తో మాట్లాడారు. ఆయన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కోసారి తాము రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయాల్సి వస్తోందని చెప్పారాయన.

కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లోనూ రైతులు అద్భుతాలను సృష్టిస్తోన్నారని, రికార్డుస్థాయిలో పంట దిగుబడులను సాధిస్తోన్నారని చెప్పారు.రైతులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యంత కఠినమైన, ప్రతికూల పరిస్థితుల్లోనూ మనదేశ రైతులు మొక్కవోని దీక్షతో పంట దిగుబడిని సాధించగలరని మరోసారి నిరూపితమైందని అన్నారు. కిసాన్ రైళ్ల వల్ల వేర్వేరు ప్రాంతాలకు చెందిన పంట దిగుబడులు దేశవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం మామిడిపండ్ల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. కిసాన్ రైళ్లు.. వందల టన్నుల విజయగరం మామిడిపండ్లు ఢిల్లీకి చేరుస్తున్నాయని..ఢిల్లీ ప్రజలు,ఉత్తర భారత ప్రజలు విజయనగరం మామిడిపండ్ల రుచిని ఆస్వాదించగల్గుతారని..అదే సమయంలో విజయగరం రైతులు కూడా బాగా సంపాదించగల్గుతారని ప్రధాని అన్నారు.

యాస్​, తౌటే తుఫాను వేళలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయటం వల్ల గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గిందని ప్రధాని చెప్పారు. విపత్తు వేళలో తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ఓపిక, క్రమశిక్షణతో ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. పదిరోజుల వ్యవధిలో తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలు రెండు తుపాన్లను ఎదుర్కొన్నాయి. పశ్చిమ తీరాన్ని ‘తౌటే’ తుపాను కుదిపేయగా.. తూర్పు తీరంలో ‘యాస్​’ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేశాయి. ఫలితంగా గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగింది. ఈ విపత్కర సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి సెల్యూట్​ చేస్తున్నాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. ఈ విచారకర సమయంలో వారి వెన్నంటే మనం నిల్చోవాలని అన్నారు. ‘సబ్​ కా సాత్​​, సబ్​ కా వికాస్, సబ్​ కా ​ విశ్వాస్’ సూత్రాన్ని పాటిస్తూ దేశం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఎన్​డీఏ ప్రభుత్వం ఏడు వసంతాలను పూర్తి చేసుకుని, ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.