మరో కోటీ 45 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఇండియా ఆర్డర్

మరో కోటీ 45 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులకు ఇండియా ఆర్డర్

India orders COVID-19 vaccine doses: భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 63లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా ఇచ్చారు. కాగా, భారత ప్రభుత్వం మరో కోటీ 45 లక్షల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కోటి డోసులు, దేశవాళీ సంస్థ భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ 45 లక్షల డోసులకు ఆర్డర్ ఇచ్చామని ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, మార్చి నాటికి వయో వృద్ధులకు టీకా ఇవ్వడం మొదలవుతుందని అధికారులు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న ఎస్ఐఐ ఇప్పటికే 1.10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేయగా, జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మంది ఫ్రంట్ లైన్ యోధులకు ఇచ్చే ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. వీరికి అవసరమైన రెండో డోస్ కూడా సిద్ధం అయింది. కాగా, ఈ టీకా డోస్ లను ఒక్కొక్కటి రూ.200 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సీరమ్ అందిస్తున్న కొవిషీల్డ్ 72 శాతం ప్రభావవంతమైనదని, కొవాగ్జిన్ తుది దశ ట్రయల్స్ ఫలితాలు మార్చిలోగా రావచ్చని ఔషధ నియంత్రణ విభాగం తెలిపింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ, కాడిలా హెల్త్ కేర్ తయారు చేస్తున్న జైకోవ్-డీ వ్యాక్సిన్ లకు సమీప భవిష్యత్తులో అనుమతి లభించవచ్చని తెలిపింది. కాగా, చాలా వేగంగా 60లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా ఇండియా రికార్డ్ సాధించింది.

కాగా, దేశంలో గత 24 గంటల్లో 11వేల 67 మందికి కరోనా నిర్ధారణ అయింది. 13వేల 87 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది.

గడచిన 24 గంట‌ల్లో 94 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,252 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,61,608 మంది కోలుకున్నారు. 1,41,511 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 66లక్షల 11వేల 561 మందికి వ్యాక్సిన్ వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20కోట్ల 33లక్షల 24వేల 655 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న(ఫిబ్రవరి 9,2021) 7లక్షల 36వేల 903 శాంపిళ్లను పరీక్షించారు.