బోర్డర్ దాటిన చైనా సైనికుడిని PLAకి అప్పగించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2020 / 09:16 PM IST
బోర్డర్ దాటిన  చైనా సైనికుడిని PLAకి అప్పగించిన భారత్

India releases Chinese soldier రెండు రోజుల క్రితం అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని బుధవారం(అక్టోబర్-21,2020)భారత​ సైన్యం… పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(PLA)కి అ‍ప్పగించింది. ప్రోటోకాల్స్‌ అనుసరిస్తూ చుషూల్‌ మోల్డో పాయింట్ దగ్గర చైనా సైన్యానికి అప్పగించింది.



దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య సహాయం అందించాము. ఆ తర్వాత అతడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గూఢచర్యానికి సంబంధించిన కోణం మాకు కనిపించలేదని తెలిపారు. అయితే, తమ సైనికుడు పశువులు మేపుకునే వ్యక్తులకు సహాయం చేస్తుండగా పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించాడని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.



కాగా, సోమవారం తూర్పు లడఖ్ లోని చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా జ‌వాను అనుకోకుండా భార‌త భూభాగంలోకి ఎంట‌ర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడి జేబులోని ఐడెంటిటీ కార్డు ఆధారంగా చైనాలోని షాంగ్జిజెన్‌ పట్టణానికి చెందిన కోర్పోరల్ వాంగ్ యా లోంగ్ గా గుర్తించారు.



కాగా, జూన్ 14న తూర్పు లడఖ్ సరిహద్దులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఆనాటి నుంచి స‌రిహ‌ద్దు మ‌రింత టెన్ష‌న్‌గా మారిన విషయం తెలిసిందే