ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 23వేల 285 కొత్త కేసులు, ఈ ఏడాది ఇదే తొలిసారి

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 23వేల 285 కొత్త కేసులు, ఈ ఏడాది ఇదే తొలిసారి

india reports 23,285 coronavirus cases: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్న రికార్డ్ స్థాయిలో 22వేల 854 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి కొత్త కేసులు బయటపడ్డాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 117 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షా 58వేల 306కు పెరిగింది. కొన్నిరోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం(మార్చి 12,2021) నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,08,856కు చేరింది.

2లక్షలకు దగ్గరలో యాక్టివ్‌ కేసులు:
ఓ వైపు కొత్త కేసులు పెరుగుతుండగా, కోలుకునేవారి సంఖ్య తగ్గుతూ పోవడం మరింత కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 15వేల 157 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మెత్తం 1,09,53,303 మంది కరోనాను జయించారు. అయితే ఆ మధ్య 97శాతం దాటిన రికవరీ రేటు.. ప్రస్తుతం 96.86శాతానికి పడిపోయింది. రికవరీలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 2లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టివ్‌ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.74శాతానికి పెరిగింది.

మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం:
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం(మార్చి 11,2021) ఒక్కరోజే అక్కడ 14వేల 317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది.

ఇక నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1.9లక్షల యాక్టివ్ కేసులుండగా.. అందులో లక్షకు పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,06,070కి చేరింది. గతేడాది(2020) నవంబర్ 6 తర్వాత మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు లక్ష దాటం మళ్లీ ఇప్పుడే. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అక్కడ మళ్లీ లాక్ డౌన్:
నాగ్ పూర్ లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది. కిరాణ, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ మూసేస్తున్నట్టు వెల్లడించింది. నాగ్ పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున(మార్చి 11,2021) నాగ్ పూర్ లో తొలి కరోనా కేసు నమోదు కావడం.. మళ్లీ అదే రోజున మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు:
తెలంగాణలో నిన్న(మార్చి 11,2021) రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 181 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 12,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. కరోనా నుంచి నిన్న 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు:
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 47వేల 803 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 60, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 23 మంది కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 78 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,178కి చేరుకుంది. మొత్తం 8,82,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి.