India Corona : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

India Corona
Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ, తాజాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 656 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 1,16,603 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 656 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,49,82,131 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో 13,037 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కరోనా నుంచి ఇప్పటివరకు 4,44,37,307 మంది పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 12 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 5,31,790కి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.03శాతం యాక్టివ్ గా ఉన్నాయి.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.