India Covid Cases : లాక్‌డౌన్ తప్పదా? దేశంలో ఒక్కరోజే 80వేలకు పైగా కరోనా కొత్త కేసులు, 469 మరణాలు

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 80వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం, 500లకు చేరువగా మరణాలు నమోదవడం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదేమో అనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

India Covid Cases : లాక్‌డౌన్ తప్పదా? దేశంలో ఒక్కరోజే 80వేలకు పైగా కరోనా కొత్త కేసులు, 469 మరణాలు

India Reports 81466 New Covid Cases

India Covid Cases : దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం, 500లకు చేరువగా మరణాలు నమోదవడం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదేమో అనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

24 గంటల్లో 81వేల 466 కేసులు, 469 మరణాలు:
దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో 11లక్షల 13వేల 966 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..81వేల 466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 23లక్షల 03వేల 131కి చేరింది. గడిచిన 24 గంటల్లో 469 మంది కరోనాకు బలయ్యారు. మొత్తంగా ఒక లక్షా 63వేల 396 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 2,2021) ఉదయం కేంద్రం బులెటిన్ విడుదల చేసింది.

6లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసుల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6లక్షల 14వేల 696కి చేరింది. యాక్టివ్ కేసుల రేటు 4.78 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 1.25 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసుల రేటులో ఇప్పుడు భారీ పెరుగుదల కనిపిస్తుడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్లిష్ట సమయంలో కొవిడ్‌ నుంచి కోలుకునే వారి గణాంకాలు కాస్త ఊరటకలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 50వేల 356 మంది వైరస్‌ను జయించారు. మొత్తం రికవరీలు 1.15 కోట్లు దాటగా.. ఆ రేటు 93.89 శాతానికి తగ్గింది.

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం:
మహరాష్ట్రలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశవ్యాప్తంగా బయటపడుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 43వేల 183 మందికి పాజిటివ్‌గా తేలగా.. 249 మంది మరణించారు. మొత్తంగా 28లక్షల మందికి పైగా కరోనా సోకగా..24 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 3,67,897 యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణలో కరోనా కల్లోలం, వెయ్యికి చేరువలో కొత్త కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. కొత్త కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 1,2021) 965 కొత్త కరోనా కేసులు వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. మరో 312 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 254 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ లో 110, రంగారెడ్డి 97, నిజామాబాద్‌ 64, నిర్మల్‌ 39, జగిత్యాల్‌ జిల్లాల్లో 35 కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరింది. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 3,01, 876 మంది కోలుకోగా.. 1,706 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 6వేల 159 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 2,622 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రులకు వచ్చే బాధితుల సంఖ్యా పెరుగుతోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్ చేసింది.

ఏపీపై కరోనా పంజా:
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31వేల 809 శాంపిల్స్ పరీక్షించగా.. ఏకంగా 1,271 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా మరో ముగ్గురు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకోగా.. కోలుకున్న వారి సంఖ్య 8,87,898 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8వేల 142 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 7వేల 220 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) సాయంత్రం వెల్లడించింది.

8వేలు దాటిన యాక్టివ్ కేసులు:
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 464 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,87,898కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,142 యాక్టివ్ కేసులున్నాయి.

ఆ నాలుగు జిల్లాల్లో సెంచరీ దాటిన కరోనా కేసులు:
గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285, గుంటూరు జిల్లాలో 279 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజు వ్యవధిలోనే నాలుగు జిల్లాల్లో 150కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కరోనా కేసులు:
అనంతపురంలో 61, చిత్తూరులో 285, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 279, కడపలో 63, కృష్ణాలో 161, కర్నూలులో 52, నెల్లూరులో 43, ప్రకాశంలో 63, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 189, విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.