India Covid 19 Cases : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం.. ఒక్కరోజే 60వేలకుపైగా కొత్త కేసులు, 300లకు చేరువలో మరణాలు

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం, 300లకు చేరువగా మరణాలు చోటు చేసుకోవడం భయాందోళనకు గురి చేస్తోంది.

India Covid 19 Cases : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం.. ఒక్కరోజే 60వేలకుపైగా కొత్త కేసులు, 300లకు చేరువలో మరణాలు

Covid 19 Cases

India Covid 19 Cases : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం, 300లకు చేరువగా మరణాలు చోటు చేసుకోవడం భయాందోళనకు గురి చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 62వేల 258 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. గత 24 గంటల్లో మరో 291 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,240కి పెరిగింది. గతేడాది అక్టోబర్ 16న ఒక్కరోజే 62వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ స్తాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే. క్రితం రోజు 257మంది కరోనాకు బలవగా, ఇప్పుడా సంఖ్య 291కి పెరిగింది.

4.50లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
కొత్త కేసుల్లో అధిక శాతం కేవలం 5 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, పంజాబ్‌, కర్నాటక, గుజరాత్, ఛత్తీస్ గఢ్ లు ఉన్నాయి. ఇందులోనూ ఒక్క మహారాష్ట్రలో అత్యధికంగా 36వేల 902 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 30వేల 386మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,95,023కి చేరింది. కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరిగాయి. దేశంలో 4లక్షల 52వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మార్చి 21న దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది.

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ:
మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28 ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అన్ని షాపింగ్‌ మాల్స్‌ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రానున్న పండుగల్లో జాగ్రత్త:
కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్‌ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్‌ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిది కాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్‌లు వంటి వాటికి సంబంధించి మార్చి 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న(మార్చి 26,2021) రాత్రి 8 గంటల వరకు 58వేల 029 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 495 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. క్రితం రోజు ఏకంగా 518 కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,685కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,878కి చేరింది.

కాగా, రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం 4వేల 241 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట వీటి సంఖ్య 2,101గా ఉండేది. రాష్ట్రంలో 4,241 యాక్టివ్‌ కేసుల్లో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 142 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,61,154కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం(మార్చి 27,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీపై కోవిడ్ పంజా:
ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో వెయ్యికి చేరువలో కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో 40వేల 604 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం(మార్చి 26,2021) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 కేసులు, విశాఖలో 170, చిత్తూరులో 163, క్రిష్ణా జిల్లాలో 110 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 306 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 8,85,515 మంది కరోనాను జయించారు. గత 24 గంటల్లో చిత్తూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కోవిడ్ తో మృతిచెందగా, ఇప్పటివరకు 7,203 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 4వేల 145 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో కోటి 49లక్షల 16వేల 201 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.