భారత్ విజయనాదం : 350 మంది ఉగ్రవాదుల హతం

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 01:19 AM IST
భారత్ విజయనాదం : 350 మంది ఉగ్రవాదుల హతం

12 మిరాజ్‌ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్‌లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్‌ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్‌ గైడెడ్‌ బాంబుల వర్షం కురిపించింది. 350-400 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది.ఉపేక్షించేది లేదు! ఉదాసీనత అసలే లేదు! అవసరమైతే గీత దాటి మరీ వాత పెడతాం అని ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు.. ఉమ్మడి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 26 గణతంత్ర దినమైతే.. ఫిబ్రవరి 26ను రణతంత్ర దినంగా మార్చి విజయనాదం చేసింది.

1971 యుద్ధం తరువాత : 
1971 యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా భారత వైమానికదళ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటాయి. పీఓకే గగనతలంలోకి దాదాపు 90కిలోమీటర్లు దూసుకెళ్లాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3.45కు మొదలై సరిగ్గా 21 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్‌ ముగిసింది. దీంతో భారత్‌ బాంబుల మోతతో పాకిస్థాన్ మేల్కొంది. 

మసూద్ అజార్ బావమరిది హతం ? : 
2 స్క్వాడ్రన్లకు చెందిన 12 మిరాజ్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. వీటికి తోడుగా సుఖోయ్‌-30 జెట్‌లు, శత్రుదేశాల విమానాల కదలికలను పసిగట్టే రాడార్లున్న రెండు అవాక్స్‌ విమానాలు, అవసరమైతే గాలిలోనే ఇంధనం నింపే విమానం రంగంలోకి దిగాయి. ఒక్కో విమానం విడివిడిగా బయలుదేరడంతో… అవి ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నాయనే సంగతిని పాక్‌ పసిగట్టలేకపోయింది. మిరాజ్‌ 2000 విమానాలు శత్రువుల రాడార్ల కంటికి చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నియంత్రణ రేఖను దాటాయి. బాలాకోట్‌ పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జైషే మహ్మద్‌కు చెందిన అతి పెద్ద ఉగ్రవాద శిబిరంపై బీడీఎల్‌-1000 బాంబులతో విరుచుకుపడ్డాయి. నిద్రలో ఉన్నవారు ఉన్నట్లే… కళ్లు కూడా తెరవకుండానే ఖతమయ్యారు! ఈ దాడిలో మసూద్‌ అజార్‌ బావమరిది ఘోరీ చనిపోయినట్లు తెలుస్తోంది. 

21 నిమిషాల్లో : 
బాలాకోట్‌తోపాటు ముజఫరాబాద్‌, చకోటీల్లోని జైషేకు చెందిన అల్ఫా-3 కంట్రోల్‌ రూమ్‌లను కూడా వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. తెల్లవారుజామున 3.48 నుంచి 3.55 నిమిషాల మధ్య ముజఫరాబాద్‌ సమీపంలోని జైషే కంట్రోల్‌ రూమ్‌లు నేలమట్టమయ్యాయి. ఆ తర్వాత… 3.58 నుంచి 4.04 మధ్య చకోటీల్లోని శిబిరాలను బలగాలు ధ్వంసం చేశాయి. చేయాల్సిన పనిని కేవలం 21 నిమిషాల్లో పూర్తిచేసిన మిరాజ్‌-2000 విమానాలు భద్రంగా తమ స్థావరాలకు తిరిగి వచ్చాయి.