ఫేక్ న్యూస్ ప్రచారం : రాజ్ దీప్ ని రెండు వారాలు సస్పెండ్ చేసిన ఇండియా టుడే

ఫేక్ న్యూస్ ప్రచారం : రాజ్ దీప్ ని రెండు వారాలు సస్పెండ్ చేసిన ఇండియా టుడే

Rajdeep Sardesai సీనియర్‌ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్‌ ప్రజెంటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనను ఉద్దేశించి ఆయన చేసిన ఓ తప్పుడు ట్వీట్ పై దుమారం చెలరేగడంతో యాజమాన్యం చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు వారాల పాటు రాజ్ దీప్ ని సస్పెండ్‌ చేయడంతో పాటు నెల జీతం కోత విధించినట్లు సమాచారం.

అసలేం జరిగింది

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల ర్యాలీతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులకు-పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన 27 ఏళ్ల నవ్రీత్ సింగ్ అనే రైతు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు. పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్‌ మరణించాడు. అతడి త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు అని రాజ్ దీప్ ట్వీట్ చేశారు.

వాస్తవానికి ట్రాక్టర్‌ బోల్తాపడటంతో నవనీత్‌ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోను ఢిల్లీ పోలీసులు అదే రోజు సాయంత్రం విడుదల చేశారు. బారికేడ్ల వైపు ట్రాక్టర్‌పై వేగంగా దుసుకువచ్చిన నవనీత్‌, వాహనం పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన ట్వీట్‌ డెలీట్‌ చేశారు.

అయితే, ఆ తర్వాత ట్రాక్టర్‌ మీద ఉండగానే, పోలీసులు నవనీత్‌ను కాల్చేశారని రైతులు ఆరోపిస్తున్నారని మరో ట్వీట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేసి, అందులో ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజ్ దీప్ పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజ్‍దీప్ సర్దేశాయ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. టాప్ జర్నలిస్టుగా ఉంటూ నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఎలా ట్వీట్ చేస్తారంటూ బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్‌ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిజానికి ఆయన ఈ ట్వీట్ ను వ్యక్తిగత ఖాతా నుంచే చేశారు గానీ, ఇండియా టుడే వార్తల్లోగానీ, ట్వీట్లలోగానీ ఎక్కడా ఆ విషయాన్ని(రైతు తూటాలకు బలైనట్లు) పేర్కనలేదు. అయినాసరే, ఇండియా టుడే యాజమాన్యం రాజ్‍దీప్ సర్దేశాయ్ పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ దీప్ ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌, న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్నారు.