త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో దేశం దు:ఖించింది

త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో దేశం దు:ఖించింది

India Was Saddened రిపబ్లిక్​ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్​ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట ఘటన లోత్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం తనకు బాధకల్గించిందన్నారు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి దానితో సంబంధం ఉన్న సంఘటనల గురించి పుస్తకాలను రాయాలని మన్ కీ బాత్ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. ఈ ఘటనలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు.

2020 ఏడాది.. దేశం ఎంతో సంయమనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన యుద్దం ప్రపంచానికి ఒక ఉదహరణగా ఆయన చెప్పారు. కొత్త ఏడాదిలో కూడా అదే తరహాలో ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్ధితుల్లో భారత్‌ ప్రపంచానికే ఆశాజ్యోతిగా మారిందని, కరోనా టీకా పంపిణీ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. 15 రోజుల్లోనే 30లక్షల మందికి టీకా అందించి భారత్‌ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్​ స్వయం సమృద్ధి సాధించిందన్నారు. భారత్‌లో తయారీలో భాగంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌లు దేశ ఆత్మ నిర్భరతకు, ఆత్మ విశ్వాసానికి ప్రతీకలుగా మోడీ అభివర్ణించారు. దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడ పంపిణీ చేస్తున్నామని ప్రధాని తెలిపారు.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి​ ​ టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని మన్​కీ బాత్​ లో మోడీ గుర్తు చేశారు. ఆసీస్ గడ్డపై భారత క్రికెటర్లు సత్తా చాటారన్నారు. సిరీస్​ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. తిరిగి పుంజుకుని జయకేతనం ఎగురవేసిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఈ నెల మొదటి వారంలో బెంగుళూరుకు పెద్ద విమానాన్ని నడిపిన నలుగురు మహిళా పైలెట్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఇండియన్ పైలెట్ల కృషిని ఆయన అభినందించారు.త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం తనకు బాధకల్గించిందన్నారు. కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన దివ్యాంగ వృద్దుడు పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెంబనాడ్ సరస్సులో ప్లాస్టిక్ బాటిళ్లను అడ్డుకోవడం వంటి వాటిని చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.