నేడే రెండో దఫా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్

నేడే రెండో దఫా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్

Second National Dry Run దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్​ నిర్వహించగా..ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్​ నిర్వహిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్​ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

రెండో దఫా వ్యాక్సిన్​ మాక్​ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్​ సెక్రటరీలత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. టీకా డ్రై రన్​ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొవిడ్​-19 వ్యాక్సిన్​ భద్రత, సామర్థ్యంపై పుకార్లు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కో-విన్​ యాప్​ పనితీరుపై వివరించారు.

కాగా, ఈ నెల 2న తొలివిడత డ్రై రన్​లో మొత్తం 125 జిల్లాలలో నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 2న జరిగిన డ్రై రన్​లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకొని శుక్రవారం చేపట్టే డ్రై రన్​కు సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర మంత్రి. ఇవాళ జరిగే డ్రై రన్​లో ఆసుపత్రి, బ్లాక్​, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి డేటాను పరీక్షించనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్​ పంపిణీలో వచ్చే లోటుపాట్లను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ డ్రై రన్​ ఉపయోగకరంగా ఉంటుందని హర్షవర్థన్ తెలిపారు.