లడఖ్ లో భారత్-చైనా యుద్ధ ట్యాంకులు,బలగాల ఉపసంహరణ : వీడియో

లడఖ్ లో భారత్-చైనా యుద్ధ ట్యాంకులు,బలగాల ఉపసంహరణ : వీడియో

Ladakh తూర్పు ల‌డఖ్ లోని పాంగాంగ్ సరస్సుకి ఉత్తర,దక్షిణ వైపున మొహరించిన బ‌ల‌గాల‌ను ద‌శ‌ల వారీగా ఉప‌సంహ‌రించుకోవాల‌న్న ఒప్పందం త‌ర్వాత భారత్-చైనాకు చెందిన యుద్ధ ట్యాంకులు వెన‌క్కి మ‌ర‌లుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ కొద్దిసేపటి కింద‌ విడుదల చేసింది.

తొమ్మిది నెల‌లుగా తూర్పు ల‌డఖ్ లోని పాంగాంగ్ స‌రస్సు ద‌గ్గ‌ర రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చైనా భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌డంతో ఇండియా కూడా అందుకు దీటుగా బ‌దులిచ్చింది. అయితే రెండు దేశాల మ‌ధ్య ఇప్ప‌టికే ప‌లుమార్లు జ‌రిగిన చ‌ర్చ‌ల త‌ర్వాత బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌కు రెండు దేశాలు అంగీక‌రించాయి. ఇదే విషయాన్ని గురువారం రాజ్య‌స‌భ‌లోనూ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేలా భారత్​-చైనా ఒప్పందం కుదిరిందని..దీని ప్రకారం ఇరు దేశాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని వెల్లడించారు.

ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయని.. అయితే కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడం, పెట్రోలింగ్​ వంటి సమస్యలున్నాయని రాజ్ నాథ్ తెలిపారు. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు.. భారత బలగాలు ఫింగర్​ 3 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ (ధన్ సింగ్ తాపా పోస్ట్)దగ్గర ఉంటాయని రాజ్ నాథ్ పేర్కొన్నారు.