‘ఇండియా.. చైనా కంటే శక్తిమంతంగా ఎదగాలి’

‘ఇండియా.. చైనా కంటే శక్తిమంతంగా ఎదగాలి’

భారతదేశం ప్రపంచంలో చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. విజయదశమి (దసరా) వేడుకల్లో భాగంగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్ఎస్ ర్యాలీలో పాల్గొన్నారు.

RSS సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా భారత్ సైన్యాన్ని బలోపేతం చేసి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగా నిలబడుతోందని అందుకు అమెరికా, తైవాన్, వియత్నాం దేశాలను ఉదాహరణగా చూపి మాట్లాడారు. భారత్ అన్ని దేశాలతో స్నేహ భావంతో మెలగాలని, ఆ స్నేహ భావాన్ని ఇతరులు బలహీనతగా భావించి దాడి చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన చెప్పారు.



సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)పై జరుగుతున్న ఘర్షణలపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా తగ్గుతుందనే ఆలోచనతో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. సున్నితమైన ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని అవకాశవాదులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పడేలా చేస్తున్నారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని.. కానీ కరోనావైరస్ విజృంభణతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయని చెప్పారు.

‘సీఏఏ అనేది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని చూస్తున్నవారంతా ముస్లిం జనాభాను తక్కువ చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ముస్లింలను తప్పుదోవ పట్టించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో అందరి దృష్టి మళ్లడంతో.. వారి ప్రయత్నాలకు తగిన ప్రచారం కలగలేదు. భారత్ చుట్టువైపులా ఉన్న దేశాల్లో వివక్ష ఎదుర్కొంటున్న మతాలకు పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించారు. ఈ సవరణ అనేది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా వ్యతిరేక నిర్ణయం కాదు. దేశానికి వచ్చే విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడానికి రాజ్యంగ నిబంధనలు అలానే కొనసాగుతాయని చెప్పారు.