Facebook Mayur Fartade : ఫేస్‌బుక్ నుంచి 22లక్షలు గెలుచుకున్న 21ఏళ్ల ఇండియన్ హ్యాకర్

ఆ కుర్రాడి వయసు 21ఏళ్లే. కానీ తెలివితేటలు అమోఘం. అతడి టాలెంట్ కు ఏకంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అబ్బురపోయింది.

Facebook Mayur Fartade : ఫేస్‌బుక్ నుంచి 22లక్షలు గెలుచుకున్న 21ఏళ్ల ఇండియన్ హ్యాకర్

Facebook Mayur Fartade

Facebook Mayur Fartade : ఆ కుర్రాడి వయసు 21ఏళ్లే. కానీ తెలివితేటలు అమోఘం. అతడి టాలెంట్ కు ఏకంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అబ్బురపోయింది. అతడి టాలెంట్ ని గుర్తిస్తూ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు అక్షరాల రూ.22లక్షలు బహుమతిగా ఇచ్చింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఏం సాధించాడు? అంటే..

సోషల్ మీడియాలో పర్సనల్ డీటైల్స్ షేర్‌ చేయడం అంత మంచిది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫైల్‌ లాక్‌ సదుపాయాన్ని సోషల్ మీడియాలు కల్పిస్తున్నాయి. అయినా వాటిలోని చిన్న చిన్న బగ్స్‌ సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు 21ఏళ్ల యువకుడు మయూర్‌ ఫర్తడే. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు అకౌంట్స్ ను ఫాలో అవ్వకుండానే వారి ఫొటోలు, వివరాలు తస్కరించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించేలా ఈ బగ్‌ ఉపయోగపడుతుందని గుర్తించాడు. దీంతో ఇన్‌స్టా మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి ఏకంగా రూ.22 లక్షలు అందుకున్నాడు.

సోలాపూర్‌కు చెందిన మయూర్‌ ఫర్తడే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ లోపాన్ని కనుగొన్నాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసిన మయూర్‌.. ఇన్‌స్టాలో సైబర్‌ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో వివరించాడు. ఈ బగ్‌ ద్వారా ప్రైవేట్‌ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్‌ పోస్టులు, స్టోరీలు, రీల్స్‌ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు.

వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్‌ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్‌ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్‌ ఫోర్స్‌డ్‌ మీడియా ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా సదరు పోస్ట్‌ తాలూకు లింక్‌, పోస్ట్‌ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పొందిన సమాచారంతో.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు అటాచ్ అయిన ఫేస్ బుక్ పేజీలను సైతం యాక్సెస్ చేయొచ్చని కనుగొన్నాడు.

ఇదే విషయాన్ని ఏప్రిల్ 16న ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకెళ్లాడు మయూర్‌. అందుకు ఏప్రిల్‌ 19న బదులిచ్చిన ఫేస్‌బుక్‌… ఆ లోపాన్ని సవరించుకుంది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ జూన్‌ 15న రూ.22 లక్షలను మయూర్‌కు అందజేసింది. బగ్‌ను కనుగొన్నందుకు గానూ ధన్యవాదాలు చెప్పడమే కాకుండా.. భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని కోరుతూ లేఖ రాసింది. మరోవైపు తన బగ్‌ బౌంటీని ఇకపైనా కొనసాగిస్తానని మయూర్ చెప్పాడు‌. అయితే, దాన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అవ్వాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు.

C++, పైతాన్(Python) లో మయూర్ మంచి పట్టు సాధించాడు. అపారమైన స్కిల్స్ అతడి సొంతం. సెకండియర్ చదువుతున్న సమయంలో ప్రభుత్వ వెబ్ సైట్లలో పలు బగ్స్ ను మయూర్ కనుగొన్నాడు.