భారత్‌‌లో కరోనా..@142 కేసులు

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 01:17 AM IST
భారత్‌‌లో కరోనా..@142 కేసులు

భారతో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కరోనాతో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో ఒకరిది కర్నాటక కాగా.. మరొకరిది ఢిల్లీ. 

కరోనా వైరస్‌ తీవ్రత మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు అత్యధికంగా 41 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.   ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం నాగపూర్‌ సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించింది. షిరిడీ సహా పలు ప్రముఖ ఆలయాలు, ప్రాచీన కట్టడాలను సైతం మూసేందుకు నిర్ణయం తీసుకుంది. 

భారత్‌ను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది.లద్దాఖ్ స్కౌట్స్‌లో పనిచేసే ఓ జవాన్‌కు కోవిడ్-19 సోకినట్టు తెలుస్తోంది. జవాన్ తండ్రికి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. అతడి తండ్రి ఇరాన్‌లో పర్యటించి ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో జవాన్ కుటుంబంలో మిగిలిన సభ్యులకు కూడా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

ఈ కేసులో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు బెంగాల్‌లోనూ తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఈ మధ్య లండన్‌లో పర్యటించి వచ్చాడు. దీంతో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడిని వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. బాధితుడి తల్లిదండ్రులతోపాటు అతడి డ్రైవర్‌ను కూడా ఐసోలేషన్‌ వార్డుకు ప్రభుత్వం తరలించి చికిత్స అందిస్తోంది.
Read More : కరోనా ఎఫెక్ట్ : GHMC అలర్ట్..రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు