Indian Railways : దేశవ్యాప్తంగా మరోసారి రైళ్లన్నీ రద్దు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ విధించాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి రైళ్లన్నీ రద్దు చేస్తారా?

Indian Railways : దేశవ్యాప్తంగా మరోసారి రైళ్లన్నీ రద్దు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

Indian Railways

Indian Railways : దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరోసారి రైళ్లను కూడా ఆపేస్తారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇది వలస కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రైల్వే సేవలను పూర్తిగా ఆపేస్తారన్న ప్రచారంతో వలస కార్మికులు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. ముంబై నుంచి యూపీకి వెళ్లే రైళ్లలోని సాధారణ బోగీలు వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.

రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన లేదు:
మరోసారి రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ తోసిపుచ్చారు. రైళ్లను నిలిపివేసే యోచన రైల్వే శాఖకు లేదని ఆయన స్పష్టంచేశారు. వేసవికాల ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు తెలిపారు. వేసవికాలంలో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ సహజమేనని చెప్పారు. రైల్వే సేవలను ఆపేస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

క్రమంగా రైళ్ల సంఖ్య పెంపు:
దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్‌డౌన్ భ‌యాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొన‌సాగుతాయ‌ని సునీత్ శ‌ర్మ తేల్చి చెప్పారు. రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌యాణించాల‌నుకున్న వాళ్ల‌కు రైళ్ల కొర‌త లేద‌ని కూడా సునీత్ తెలిపారు. ఈ స‌మ‌యంలో రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ సాధార‌ణంగానే ఉంద‌ని, క్ర‌మంగా రైళ్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని చెప్పారు. ఇక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా అవ‌స‌రం లేద‌ని సునీత్ స్పష్టం చేశారు. డిమాండ్ కు అనుగుణంగా రైల్వే శాఖ ట్రైన్ సర్వీసులు నడుపుతుందన్నారు. పలు రాష్ట్రాలతో రైల్వే శాఖ కాంటాక్ట్ లో ఉందని… గోరక్ పూర్, పాట్నా, దర్బంగ, వారణాసి, గౌహతి, ప్రయాగ్ రాజ్, బొకారో, రాంచీ, లక్నో తదితర ప్రాంతాలు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నామన్నారు.

అవసరం ఉన్న చోట సర్వీసులు:
కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న క్రమంలో ఉత్తరాఖండ్, ఒడిశా లాంటి పలు రాష్ట్రాలు.. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆంక్షలు పెట్టాయి. అయితే, రైల్వే మాత్రం అలాంటి నిబంధనేదీ పెట్టలేదు. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని చెప్పింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని కోరుతోంది. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ రైలు సర్వీసులు నడుపుతున్నట్టు సునీత్ శర్మ వివరించారు. రైల్వేలో పని చేసే సిబ్బంది, ఉద్యోగుల భద్రత దృష్ట్యా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైల్వే శాఖ ప్రస్తుతం 70శాతం సర్వీసులను నడుపున్నట్టు సునీత్ శర్మ చెప్పారు.