Vande Bharat train : సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ .. మరికొన్ని రోజుల్లోనే

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అత్యంత త్వరలోనే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

Vande Bharat train : సికింద్రాబాద్- తిరుపతి మధ్య  వందేభారత్ ఎక్స్‌ప్రెస్ .. మరికొన్ని రోజుల్లోనే

Vande Bharat Express train from Secunderabad to Tirupati

Vande Bharat train : దేశీయంగా సిద్దమవుతున్న వందేభారత్ రైళ్లు భారత్ లో ఇప్పటికే పలు ప్రాంతాల్లు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈక్రమంలో శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. అదేమంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అత్యంత త్వరలోనే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ప్లానింగ్ దాదాపు పూర్తి అయ్యింది. రైలు ప్రయాణ మార్గం, టికెట్‌ ధర, రైలు నంబర్లు వంటి విషయాలపై అధికారులు చర్చిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రైలు సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తోంది. ఇదిలా ఉండగా..సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య కూడా వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. కాగా..రెండు నగరాల మధ్య ట్రైన్ నడపటానికి నాలుగైదు మార్గాలు ఉన్నాయి. దీంతో ఏ మార్గంలో ఈ వందేభారత్ రైలును నడపాలి? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. అంటే బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ మీదుగా, మరొకటి వరంగల్‌, ఖాజీపేట, కడప మీదుగా.. ఇంకొకటి బీబీనగర్‌ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా నడపాలని సర్వే చేపట్టారు. వీటితో పాటు పిడుగురాళ్ల జంక్షన్‌ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా సర్వే నిర్వహించారు. వీటిల్లో తక్కువ దూరం ఉన్న మార్గాన్ని పరిశీలించి ఆ మార్గం ద్వారా ఈ రైలు నడిపేందుకు అధికారులు నిర్ణయించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా..సికింద్రాబాద్‌ – తిరుపతి వందే భారత్‌ ట్రైన్‌ను బీబీనగర్‌ – నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లుగా సమాచారం.

ఈ రైలు వెళ్లే మార్గంలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్‌ల పటిష్టత ఉండాలి. ఇలా పలు కీలక అంశాలల్లో స్పష్టం రావాల్సి ఉంది. దీంట్లో భాగంగానే ఆయా రూట్లలో ఉండే వంతెన నిర్మాణాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత మార్గాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. వందేభారత్‌ రైలు టికెట్‌ ధర జీఎస్‌టీ, తత్కాల్‌ సర్‌ఛార్జితో కలిపి రూ.1150 నుంచి ప్రారంభం కానుంది. టికెట్‌ ఛార్జి, రైలు నంబర్లు ఖరారు కాగానే ప్రయాణికుల అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందపరచనున్నారు.

సాధారణంగా తిరుపతి- సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సమయం 12 గంటలు పడుతోంది. కానీ వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణం సమయం తగ్గిపోనుంది. 12 గంటల ప్రయాణం కాస్తా దాదాపు సగం తగ్గిపోయి కేవలం ఆరు నుంచి ఏడు గంటలు పడుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. దీంతో తిరుమల, తిరుపతి పర్యాటకులు, భక్తులు వందేభారత్‌ రైలు సేవలను వినియోగించుకోవటానికి ఆసక్తి చూపుతారని అధికారులు అభిప్రాయపడతున్నారు. ఈ రైలు సేవల్ని అందుబాటులోకి తీసుకురావటానికి కసరత్తులు జరుగుతున్న క్రమంలో ఈనెల ( ఫిబ్రవరి,2023) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.