చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లు..17 గంటలు నాన్‌స్టాప్‌గా విమానాన్ని నడిపి రికార్డు క్రియేట్

చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లు..17 గంటలు నాన్‌స్టాప్‌గా విమానాన్ని నడిపి రికార్డు క్రియేట్

Indian women pilots make history by flying non-stop for 17 hours : భారత్‌ మహిళా పైలెట్లు చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ దూరం విమానాన్ని నడిపిన మహిళా పైలెట్లుగా రికార్డు క్రియేట్‌ చేశారు. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి పెద్ద సాహసమే చేశారు. నలుగురు మహిళా పైలెట్లు, సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం చేసిన భారీ విమానం ఇవాళ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ176.. అట్లాంటిక్ మార్గంలో ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి బెంగళూరుకు చేరింది. శాన్ ఫ్రాన్సిస్కో- బెంగళూరుకు మధ్య సుదీర్ఘమైన 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ విమానాన్ని మహిళా పైలెట్లు నడిపి చరిత్ర సృష్టించారు. అందులోను భారతీయ మహిళా పైలట్లు ఈ ఘనత సాధించడంతో ప్రపంచానికి ఇండియా మహిళల ప్రతిభ ఏంటో మరో సారీ తెలిసివచ్చింది.

బెంగళూరు విమాశ్రయం చేరుకున్న పైలెట్లకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఈ ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రధాన పైలెట్‌గా కెప్టెన్ జోయా అగర్వాల్.. అసిస్టెంట్ పైలెట్స్‌గా తెలుగు అమ్మాయి కెప్టెన్‌ తన్మయ్, కెప్టెన్‌ సోనావారే, కెప్టెన్‌ శివానీ మన్‌హాస్ వ్యవహరించారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఓ గొప్ప అనుభవం.. ప్రయాణానికి దాదాపు 17 గంటలు పట్టిందంటూ సహాయ పైలట్ కెప్టెన్ శివానీ మనహాస్ సంతోషం వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారతీయ మహిళలు.. వైమానిక రంగంలోనూ సత్తాచాటారు. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఓ నాన్‌స్టాప్‌ కమర్షియల్‌ ఎయిరిండియా విమానాన్ని నడిపించడం ఇంతకముందు ఏప్పుడు జరగలేదు. కమర్షియల్ విమానాలను సుదీర్ఘమైన మార్గంలో ఇంత వరకు ప్రపంచంలోని మరే ఇతర విమానయాన సంస్థలు నడిపిన దాఖలాలు కూడా లేవు. ఈ మార్గంలో గాలివేగాన్ని బట్టి ప్రయాణానికి 17 గంటలకుపైగా పడుతుంది. అయితే కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ నేతృత్వంలోని టీమ్‌ భారత మహిళల కీర్తి పతాకాన్ని ఆకాశ వీధిలో ఎగురవేసింది. ఇది ఓ చరిత్రాత్మక ప్రయాణమని ఎయిరిండియా కొనియాడింది.