India ‘Varuna’ Drone : 130 కిలోల బరువు మోయగలిగే ‘వరుణ’ డ్రోన్..

130 కిలోల బరువు మోయగలిగే ‘వరుణ’ డ్రోన్..ప్రదర్శన విజయవంతమైంది. అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు..రక్షణ దళాల ఉపయోగానికి పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ‘వరుణ’ డ్రోన్‌ను తయారుచేసింది.

India ‘Varuna’ Drone : 130 కిలోల బరువు మోయగలిగే ‘వరుణ’ డ్రోన్..

 India 'Varuna' drone

India ‘Varuna’ drone : టెక్నాలజీలో ‘డ్రోన్స్’ తెచ్చిన మార్పలు అంతా ఇంతా కాదు. పుట్టినరోజు, పెళ్లి రోజు షూటింగ్ లనుంచి దేశానికి దేశాలకు మధ్య రహస్యంగా ప్రయోగించేలా మారిపోయాయి. దేశ సరిహద్దుల్లో ఆనుపానులు తెలుసుకోవటానికి డ్రోన్ల వినియోగం బాగా పెరిగింది. అలాగే వైద్య రంగంలో కూడా డ్రోన్లను వినియోగిస్తూ రాకపోకలు లేని ప్రాంతాలకు కూడా ఔషధాలను తరలింపులకు వినియోగిస్తున్నారు. ఇటువంటి డ్రోన్లు అన్నింటి కంటే పెద్దది..ఒక మాటలో చెప్పాలంటూ ‘బాహుబలి డ్రోన్’ అని చెప్పే డ్రోన్ ఒకటి తయారైంది. అది ఎంత పెద్దది అంటూ ఏకంగా మనిషినే మోయగలిగేంత పెద్దది. ఇంకా చెప్పాలంటే 130 కిలోల బరువును మోయగలదు ఈ బాహుబలి డ్రోన్. దాని పేరు ‘వరుణ’..ఈ వరుణ భారత్ లోనే తయారైంది.

అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో సిద్ధమైంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు..రక్షణ దళాల ఉపయోగానికి పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ‘వరుణ’ డ్రోన్‌ను తయారుచేసింది. తాజాగా దీని పనితీరును ప్రదర్శించింది. వరుణ వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డ్రోన్‌.. 130 కిలోల బరువు మోయగలదు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది. మనుషుల రవాణాకు కూడా  ఈ డ్రోన్‌ను వినియోగించవచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు.

రోడ్డు మార్గంతో పోలిస్తే..వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువగా ఉంటుంది. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్‌ ద్వారా కేవలం 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్‌ను ఎయిర్‌ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్‌ బబ్బర్‌ తెలిపారు. కాగా భారత నౌకాదళం కోసం అభివృద్ధి చేసిన పైలట్‌లెస్ డ్రోన్ 130 కిలోల వరకు పేలోడ్‌ను మోయగలదు. ఆ బరువుతో 25 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించే శక్తి డ్రోన్‌కు ఉంది.

కాగా సరైన రోడ్డు సౌకర్యాలు లేక..గర్బిణులను డోలీల్లో మోసుకెళ్లుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించలేని దుస్థితిలో వారి ప్రాణాలు కోల్పోతున్న దుర్భర స్థితులు మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ వరుణ డ్రోన్ సహాయంతో మనుషుల ప్రాణాలకు కాపాడొచ్చు.