Five States Polls : సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు

షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.

Five States Polls : సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు

Indias Election Commission Is Confident Of Holding Five State Polls In 2022 On Time

Five State Polls షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గ‌డువు 2022 మే నెలాఖ‌రుతో ముగుస్తుంది. పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా అసెంబ్లీల‌ గడువు మార్చి-2020తో ముగియనుంది. అయితే, ఈ ఏడాది చివర్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సి ఉన్న ఈ ఐదు రాష్ట్రాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా? లేదా వాయిదా వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర.

స‌కాలంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని సుశీల్ చంద్ర చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత అని ఆయన తెలిపారు. గ‌డువు తీరిపోయే లోపు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించి, గెలుపొందిన శాస‌న‌స‌భ్యులు జాబితాను సంబంధిత రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌డం త‌మ విధి అని చెప్పారు. క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌ల‌తోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చాలా అనుభ‌వం గ‌డించినట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే మహమ్మారి ప్రభావం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీంతో వచ్చే ఏడాది నాటికి కరోనా కష్టాలు తగ్గుతాయని సీఈసీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు, దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తొలిస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ లో దాదాపు 14.66కోట్ల మంది ఓటర్లున్నారు. పంజాబ్‌లో రెండు కోట్లు, ఉత్తరాఖండ్‌ లో 78 లక్షలు, మణిపూర్‌లో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 17.84కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి సవాల్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.