భారత్‌లో తగ్గిపోతున్న ఇంటర్నెట్ స్పీడ్

భారత్‌లో తగ్గిపోతున్న ఇంటర్నెట్ స్పీడ్

లాక్‌డౌన్ పుణ్యమా అని కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తున్నాం. ఇన్నాళ్లు పట్టించుకోని మొబైల్ డేటా స్పీడ్, వైఫై స్పీడ్‌ తగ్గిపోవడం కళ్లారా చూస్తున్నాం. మన సిటీలో మాత్రమే కాదు.. దేశమంతా అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే భారత్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుండటాన్ని గమనించింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, యాండ్రాయిడ్ టీవీలు వాడుతున్న వారికి ఇది చాలా పెద్ద సమస్యే మరి. 

స్పీడ్ టెస్ట్ జయంట్ Ookla ఇటీవల వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా Indiaలో ఇంటర్నెట్ స్పీడ్ క్రమంగా తగ్గిపోతున్నట్లు తేలింది. మార్చి 2020 నాటికి భారత్ మొబైల్ డేటా స్పీడ్‌లో 130వ ర్యాంకుకు చేరింది. బ్రాండ్‌బాండ్ సేవల్లో రెండు స్థానాలకు పడిపోయి 71కి చేరుకుంది. 

గతంలో broadband స్పీడ్ 39.65ఎంబీపీఎస్‌గా ఉంటే ప్రస్తుతం 35.98ఎంబీపీఎస్‌కి పడిపోయింది. మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 1.68 ఎంబీపీఎస్ తగ్గిపోయింది. 2020 జనవరిలో 41.48ఎంబీపీఎస్ గా ఉన్న broadband స్పీడ్.. మార్చి నాటికి 35.98ఎంబీపీఎస్ కు పడిపోయింది. అంటే 5.5 ఎంబీపీఎస్ తగ్గిపోయిందన్నమాట.

ప్రపంచదేశాలతో పోలిస్తే యూఏఈ మొబైల్ ఇంటర్నెట్ అందించడంలో టాప్ లో ఉంది. యావరేజ్ డౌన్ లోడ్ స్పీడ్ 83.52ఎంబీపీఎస్ గా ఉంది. broadband స్పీడ్ లో సింగపూర్ 197.26ఎంబీపీఎస్ గా ఉండి టాప్ స్థానంలో నిలిచింది. వీటి వెనుక కారణాన్ని కూడా వివరించింది Ookla. లాక్ డౌన్ లాంటి సమయాల్లో సహజంగానే వినియోగం పెరిగి స్పీడ్ తగ్గిపోతుంది. ఇండియాలో వినియోగదారులు డైలీ యాక్టివిటీస్ ఇంటర్నెట్ తో ముడిపడి ఉంటున్నాయి. 

గతం కంటే వినియోగం పెరుగుతుండటంతో స్పీడ్ తగ్గిపోతుంది. ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న కంపెనీలు అదే స్పీడ్ వాడుతున్నప్పటికీ కస్టమర్లు పెరిగి షేరింగ్ తో వేగం తగ్గిపోతుందన్న మాట. అంతేకానీ, ఏ ఒక్క మొబైల్ నెట్ వర్క్ పనితీరో బాగాలేకపోవడంతో స్పీడ్ తగ్గలేదు. అన్ని నెట్‌వర్క్‌ల వినియోగం పెరిగింది. అన్ని సర్వీసులు వేగం తగ్గింది.