బోర్డర్​లో కొత్త రూల్స్…తుపాకులు వాడేందుకు జవాన్లకు పూర్తి స్వేచ్ఛ

  • Published By: venkaiahnaidu ,Published On : June 21, 2020 / 11:28 AM IST
బోర్డర్​లో కొత్త రూల్స్…తుపాకులు వాడేందుకు జవాన్లకు పూర్తి  స్వేచ్ఛ

తూర్పు లడఖ్ లోని గల్వాన్​ వ్యాలీలో సోమవారం నాటి  ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​’లో భారత్  కీలక మార్పులు చేసింది. దీంతో  అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. . 

వాస్తవాధీన రేఖ వెంబడి ఆర్​ఓఈ(రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​)లో భారత్ చేసిన ​ భారీ మార్పుల ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో సైనికులు కాల్పులు జరిపే విధంగా కమాండర్లు వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. ఇందుకోసం అన్ని వనరులను ఉపయోగించుకోవచ్చు. తుపాకులను వాడొచ్చు. గల్వాన్​ లోయలో ఈ నెల 15న చైనాతో జరిగిన భీకర పోరులో 20మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్  ఈ నిర్ణయం తీసుకుంది.  

తుపాకులు ఉన్నా…గల్వాన్​ లోయలో పక్కా ప్రణాళికతో చైనీయులు భారత జవాన్లపై దాడికి తెగబడ్డారు. సైనికులు తేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లోనూ భారత జవాన్లు తమ దగ్గర అయుధాలు ఉన్నా ఉపయోగించలేదు. చైనాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తుపాకులను వాడకూడదన్న సీనియర్ల ఆదేశాలే ఇందుకు కారణం. ఫలితంగా 20మంది సైనికులు అమరులయ్యారు. అమరులైన జవాన్లలో తెలంగాణ లోని సూర్యాపేట జూ చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా వున్నా విషయం తెలిసిందే. 

గల్వాన్​ లోయలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్ద ఆయుధాలు లేవా అని విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా స్పందించారు.సరిహద్దులో విధులు నిర్వహించే జవాన్ల వద్ద ఆయుధాలు కచ్చితంగా ఉంటాయి. ఈ నెల 15న గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణ సమయంలోనూ మన సైనికుల వద్ద తుపాకులు ఉన్నాయి. కానీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు ప్రకారం జవాన్లు వాటిని ఉపయోగించలేదు అని  జైశంకర్ చెప్పిన విషయం తెలిసిందే. 

కాగా, భారతీయ సైనికులకు వ్యతిరేకంగా ఇనుప రాడ్లు, రాళ్ళు మరియు గోర్లు మరియు ముళ్ల తీగ వంటి ముడి ఆయుధాలను ఉపయోగించడం ద్వారా ఇప్పటికే చైనా కూడా  వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​’ లో  మార్పులు చేసింది.

మరోవైపు, తూర్పు లడఖ్ లో  ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని రాజ్‌నాథ్ సింగ్  ఆదేశించారు. చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దాడులకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. సైనికులకు 500కోట్ల అత్యవసర నిధులను కూడా కేంద్రం విడుదల చేసింది. 

Read: కరోనా అని పొరబడి…కుటుంబ సభ్యులకు చెప్పకుండానే యువకుడి దహనం