గుడ్ న్యూస్, కరోనా మందు రెమ్‌డెసివిర్‌ తొలి బ్యాచ్‌ను సిప్లాకు పంపిన సావరిన్ ఫార్మా

  • Published By: naveen ,Published On : July 8, 2020 / 08:21 AM IST
గుడ్ న్యూస్, కరోనా మందు రెమ్‌డెసివిర్‌ తొలి బ్యాచ్‌ను సిప్లాకు పంపిన సావరిన్ ఫార్మా

భారత్‌కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్ ఫార్మా ఈ-మెయిల్ ద్వారా సిప్లాకు తెలిపింది. అయితే సిప్లాకు పంపిన తొలి బ్యాచ్ లో ఎన్ని వయల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మాత్రం సావరిన్ ఫార్మా రివీల్ చెయ్యలేదు. సిప్లా రెమ్ డెసివిర్ కు జనరిక్ వర్షన్ ఔషధాన్ని సావరిన్ ఫార్మా తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌కు ఫుల్ డిమాండ్:
గిల్లెడ్ సైన్సెస్ కు చెందిన రెమ్ డెసివిర్ కు చాలా డిమాండ్ ఉంది. కరోనా చికిత్సలో ఈ మెడిసిన్ ను డాక్టర్లు రెకమెండ్ చేస్తున్నారు. ఈ మెడిసిన్ ఇవ్వడంతో కరోనా రోగులు కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం ఈ ఔషధానికి డిమాండ్ ఏర్పడింది. దీంతో రెమ్ డెసివిర్ సరఫరా చేసేందుకు పలు డ్రగ్ మేకర్స్ తో గిల్లెడ్ ఒప్పందాలు చేసుకుంది. అందులో ఇండియన్ ఫార్మా కంపెనీ సిప్లా కూడా ఒకటి. దాదాపు 127 దేశాల్లో రెమ్ డెసివిర్ అందుబాటులో ఉండేలా కృషి చేస్తోంది గిల్లెడ్ సైన్సెస్.

కరోనా మందు రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ ఔషధ తయారీకి అనుమతులు:
యాంటీవైరల్‌ ఔషధమైన రెమ్‌డిసివిర్‌ జనరిక్‌ ఔషధాన్ని దేశీయంగా విడుదల చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సిప్లా అనుమతి పొందిన సంగతి విదితమే. రెమ్ డిసివిర్ జనరిక్ వెర్షన్ సిప్రెమీ (Cipremi) పేరుతో కరోనా మందును జూన్ లో తీసుకొచ్చింది సిప్లా. 100mg వయల్ ధరను రూ.5వేలుగా నిర్ణయించింది. ఇక హెటిరో, మైలాన్ ఎన్వీ ఫార్మా కంపెనీలు కూడా రెమ్ డెసివిర్ జనరిక్ వెర్షన్ తయారు చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. హెటిరో కొవిఫర్ 100 ఎంజీ వయల్ ధర రూ.5వేల 400, మైలాన్ రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ధర రూ.4వేల 800 ఉంటుందని తెలిపాయి. దేశంలోని ఆసుపత్రులకు 20వేల వయల్స్ సరఫరా చేస్తామని హెటిరో తెలిపింది.

సిప్రెమీ పేరుతో సిప్లా, కోవిఫోర్ పేరుతో హెటిరో:
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. చాలా దేశాలు ఈ మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థలు కరోనా మందు తయారీలో నిమగ్నమయ్యాయి. రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్‌ వెర్షన్‌ ఔషధాన్ని విడుదల చేస్తున్నాయి. కోవిఫోర్‌ను హెటెరో ఫార్మా కంపెనీ… రెమ్‌డెసివిర్‌తో తయారు చేయగా… సిప్లా కూడా అదే రెమ్‌డెసివిర్‌తో… సిప్రెమీని తయారు చేసింది. ఇది కూడా కోవిఫోర్ లాగా ఇంజెక్షన్ లాగే ఉంటుంది. రెండు కంపెనీలూ… వేర్వేరు పేర్లతో ఇంజెక్షన్‌ను తయారుచేశాయి. తమ సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి… సిప్రెమీని ఉత్పత్తి చేస్తామని ముంబైకి చెందిన సిప్లా తెలిపింది. కొవిడ్ రోగులకు ట్రీట్మెంట్ కోసం యాంటీవైరల్ డ్రగ్ ను లాంచ్ చేస్తున్నాయి. మరో దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కూడా రంగంలోకి దిగింది. దేశంలో వినియోగానికి ‘డెస్రెం’ పేరుతో రెమ్ డెసివిర్ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కరోనా కట్టడికి మైలాన్‌ ఔషధం ’డెస్రెం’:
గిలీడ్ సైన్సెస్ కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్ డెసివిర్ జనరిక్‌ వెర్షన్‌ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు రూ.4,800 చొప్పున డెస్రెం విడుదల చేస్తామని మైలాన్ ప్రకటించింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సిప్లా, హెటెరో కంపెనీలు రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్‌ను ప్రకటించగా, మైలాన్ కూడా ఆ జాబితాలోకి చేరింది. కోవిడ్-19తో పేషెంట్ల పరిస్థితి ప్రమాదకరంగా మారితే ఆ సమయంలో రెమ్‌డెసివిర్ జనరిక్ వర్షన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Read Here>>విజయనగరం వైసీపీ నేతలకు వింత కష్టం!