Tuition culture: మీ పిల్లలను ట్యూషన్‌కు పంపుతున్నారా? సైకాలజిస్టులు ఏమంటున్నారో తెలుసా?

చదువు ఒక్కటే చిన్నారుల ధ్యేయం అన్నట్లు చాలా మంది తల్లిదండ్రులు ప్రవర్తిస్తుంటారు. చిన్నారులను విపరీతంగా ఒత్తిడిలోకి నెడుతుంటారు. 2023లో మీ పిల్లల విషయంలో చేసిన తప్పులు 2024లోనైనా చేయకండి..

Tuition culture: మీ పిల్లలను ట్యూషన్‌కు పంపుతున్నారా? సైకాలజిస్టులు ఏమంటున్నారో తెలుసా?

Tuition culture

చదువుకునే సమయంలో చదువుకోవాలి.. ఆడుకునే సమయంలో ఆడుకోవాలి.. చిన్న పిల్లల శారీరక, మానసిక దృఢత్వానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, చదువు ఒక్కటే చిన్నారుల ధ్యేయం అన్నట్లు చాలా మంది తల్లిదండ్రులు ప్రవర్తిస్తుంటారు. చిన్నారులను విపరీతంగా ఒత్తిడిలోకి నెట్టేస్తుంటారు.

స్కూల్, ట్యూషన్, హోం వర్క్ వీటి చుట్టే చిన్నారుల జీవితం గడిచిపోతోంది. చిన్నారులు ఉదయం నిద్రలేవగానే స్కూలు వెళ్లడానికి సిద్ధమవుతారు. బండెడు పుస్తకాలు మోసుకుంటూ బడికి వెళ్తారు. స్కూల్లో ఒక పీరియడ్ తర్వాత మరొకటి ఇలా అన్ని పీరియడ్లూ ముగుస్తాయి. ఆ తర్వాత కూడా వారికి విశ్రాంతి దొరకదు. మళ్ళీ స్కూల్లోనే ట్యూషన్ ఉంటుంది.

అనంతరం మళ్ళీ బండెడు పుస్తకాలను మోస్తూ ఇంటికి వస్తారు. అప్పుడైనా కాసేపు ఆడుకునే అవకాశం ఉండదు. ఇంటి దగ్గర మరో ట్యూషన్ కు పిల్లలను పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ ట్యూషన్ లోనూ చదువుకుని వచ్చాక ఇంట్లో మళ్ళీ హోం వర్క్ చేయమంటారు. ఇలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేవరకు చిన్నారులు చదువుకోసం పరుగులు తీస్తూనే ఉండాలి.

తమ కుమారుడు, కూతురు డాక్టర్/ఇంజనీర్/ఐఏఎస్ కావాలని ప్రతి తల్లిదండ్రులూ కలలు కంటుంటారు. అందుకోసం చిన్నప్పటి నుంచి పిల్లలను బాగా చదివించడం తప్పదు కదా? అంటారు. స్కూల్లో చదువుకున్న దానికి తోడు ట్యూషన్ కు వెళ్లడం తప్పనిసరిగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఉన్న ఈ ధోరణే భారత్ లో ట్యూషన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణమైంది.

వీధికొక కోచింగ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. పిల్లలను పిల్లలుగా కాకుండా ఓ యంత్రాల్లా చదువు చుట్టూ తిప్పుతున్నారు తల్లిదండ్రులు. దేశంలో ఈ కోచింగ్ కేంద్రాల మార్కెట్ ఎంతగా పెరిగిపోయిదంటే.. వాటి వార్షిక రెవెన్యూ రూ.24,000 కోట్లుగా ఉంది. కేంద్ర విద్యాశాఖకు 2015లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అందించిన ఓ నివేదిక ద్వారా ఈ విషయం తెలిసింది.

ప్రస్తుతం ఆ కోచింగ్ సంస్థల మార్కెట్ రెవెన్యూ రూ.58,088 కోట్లుగా ఉందని పుణెకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఇన్ఫినియం గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది. 2028 నాటికి ఈ మార్కెట్ రూ.1,33,995 కోట్లకు చేరుతుందని స్పష్టం చేసింది. నేషనల్ శాంపుల్ సర్వే-2016 నివేదిక ప్రకారం దేశంలో 7.1 కోట్ల మంది విద్యార్థులు ట్యూషన్లకు వెళ్తున్నారు.

అంతేగాక, ఈ సర్వేల ద్వారా పలు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు, బిహార్ నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పే యువకులు, టీచర్లు, స్కూళ్లలో చదువుచెప్పి ఇంటికి వచ్చి ట్యూటర్లుగా టీచర్లు మూన్ లైటింగ్ చేయడం, డిజిటల్ పద్ధతిలో ట్యూషన్లు చెప్పేవారు విపరీతంగా పెరిగిపోయారు.

తాము పెద్దగా చదువుకోలేదని, దాంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లలయినా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయాలని భావిస్తున్నామని, అందుకే వారు బాగా చదువుకోవడం కోసమే ఇంటికి వచ్చాక మళ్ళీ వారిని ట్యూషన్లకు పంపుతున్నామని చెబుతున్నారు.

సైకాలజిస్టులు ఏమంటున్నారు?
స్కూళ్లు, ట్యూషన్లలో తీరిక లేకుండా ఇలా చిన్నారులు చదువుకుంటుండంతో దాని ప్రతికూల ప్రభావం వారి మానసిక ఆరోగ్యంపై బాగా పడుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే ఒత్తిడి పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. బడిలో సరిగ్గా పాఠాలు చెప్పకపోతే, పిల్లలు సరిగ్గా చదవకపోతే గతంలో ట్యూషన్లకు పంపేవారు.

అది కూడా కొద్దిసేపే ట్యూషన్లకు వెళ్లి వచ్చేవారు. అయితే, ఇప్పుడు మాత్రం చిన్నారుల్లో అధిక శాతం మందిని ట్యూషన్లకు పంపుతున్నారని, ఇది ఒక జీవనశైలిగా మారిపోయిందని ఓ సైకాలజిస్టు చెప్పారు. దీనివల్ల పిల్లల ప్రవర్తలోనూ ప్రతికూల మార్పులు వచ్చే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి పూర్తయ్యే వరకు పిల్లలను ట్యూషన్లకు పంపడమే లక్ష్యంగా తల్లిదండ్రులు పెట్టుకున్నారు.

ఆ తర్వాత పోటీ పరీక్షలకు మళ్ళీ కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. చదువులో చురుకుగా ఉంటూ, ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులు అయ్యే చిన్నారులను కూడా తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లకు పంపుతున్నారు. చాలా మంది పిల్లలు ఆటలకు పూర్తిగా దూరమవుతున్నారు. చాలా స్కూళ్లలోనూ మైదానాలు ఉండడం లేదు. దేశంలో పట్టణ ప్రాంతాల్లోనూ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్నారులు స్కూల్, ట్యూషన్, రివిజన్, హోం వర్క్ వీటి చుట్టే తిరుగుతున్న ధోరణి పెరిగిపోతోంది.

ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ట్యూషన్ సెంటర్లు భారీగా పెరిగిపోయాయి. 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పరిస్థితులపై 2021-ఏఎస్ఈఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం 5-16 ఏళ్ల మధ్య ఉన్న బడి చిన్నారుల్లో 40 శాతం మంది ప్రైవేటు ట్యూషన్ సెంటర్లకు వెళ్లేందుకు పేర్లు నమోదుచేసుకున్నారు. పిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఒకే లక్ష్యంతో వారి మానసిక ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఈ కొత్త ఏడాదైనా తల్లిదండ్రులు మారాలని, పిల్లల్లో ఒత్తిడిని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Drugs : అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్