బృహ‌త్త‌ర మ‌ద్ద‌తుకు గ‌ర్విస్తున్నా…UNSC ఎన్నికల్లో భారత్ విజయంపై మోడీ

10TV Telugu News

ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లి(UNSC) లో భారత తాత్కాలిక స‌భ్య‌త్వానికి మ‌ద్ధ‌తు తెలిపిన దేశాల‌కు గురువారం ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి ల‌భించిన బృహ‌త్త‌ర‌మైన మ‌ద్ద‌తుకు తాను గ‌ర్విస్తున్నాన‌ని మోడీ అన్నారు. ప్రపంచ శాంతి, భ‌ద్ర‌త‌, స‌మాన‌త్వం కోసం భార‌త్‌ ఐక్యరాజ్యస‌మితి స‌భ్య‌దేశాల‌తో క‌ల‌సి ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. 

ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక‌తోపాటు ఆర్థిక‌, సామాజిక మండ‌ళ్ల ఎన్నిక‌.. శాశ్వ‌త, తాత్కాలిక సభ్య‌దేశాల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా భార‌త్ ఐక్య‌రాజ్య‌స‌మితి తాత్కాలిక స‌భ్య‌దేశంగా ఎన్నికైంది.193 సభ్యదేశాలు కలిగిన యూఎన్‌ఎస్​సీ.. 2021-2022 కాలానికిగానూ భద్రతా మండలిలో ఓ తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ను ఎన్నుకున్నాయి. భారత్  ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. ఐర్లాండ్‌, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందగా… కెనడా మాత్రం ఓటమి పాలయ్యింది.  UNSCలో భారతదేశం చివరిసారిగా పనిచేసినది 2011-12 కాలంలోనే.

ఐక్యరాజ్యసమితిలో ఆరు విభాగాలు ఉంటాయి. వాటిలో సాధారణ సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆరు విభాగాల్లో ఒకటైన భద్రతామండలి చాలా కీలకం. ఇందులో 15 దేశాలు సభ్యులుగా (5 శాశ్వత, 10 తాత్కాలిక) ఉంటాయి. ప్రస్తుతం శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే శాశ్వత సభ్యదేశాలు కాని మిగతా తాత్కాలిక సభ్య దేశాల కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌ భారీ మద్దతుతో గెలిచింది. భారతదేశం యొక్క రెండేళ్ల పదవీకాలం జనవరి 1, 2021 నుండి ప్రారంభమవుతుంది.

వీటో’ అధికారం వాళ్ళకే 

భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న ఐదింటికే.. ‘వీటో’ అధికారం ఉంటుంది. తొలుత తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఆరు కాగా.. 1965లో ఆ సంఖ్యను పదికి పెంచారు. ఈ దేశాలకు రెండేళ్ల సభ్యత్వం ఉంటుంది. 1965 నుంచి భద్రతామండలి స్వరూపమేమీ మారలేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంస్థలన్నింటిలోకి ఒక్క భద్రతామండలి నిర్ణయాలనే ఐరాస దేశాలన్నీ పాటించాల్సి ఉంటుంది. భద్రతామండలిని కాలానుగుణంగా సంస్కరించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.

భారత్​కు అవకాశం కోసం

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌ అన్ని అర్హతలూ కలిగి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనూ, ఆ తరవాత ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత్‌ కీలక సేవలు అందించింది. జనాభా, విస్తీర్ణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), నాగరికత, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థల రీత్యా శాశ్వత సభ్యత్వం పొందే హక్కు భారత్‌కే మిన్నగా ఉంది. పలు దేశాల్లో ఐరాస తరఫున శాంతి రక్షక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించిన చరిత్ర భారతదేశానిది.ఇంతవరకు ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన భారత్‌ 2021-2022లో భాగంగా తాజాగా ఎనిమిదోసారి ఎంపికైంది. 

ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టుకోకుండా భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ శాశ్వత సభ్యత్వం కోసం చేయీచేయీ కలిపి కృషి చేస్తున్నాయి. అయితే భద్రతా మండలి విస్తరణను చైనా వ్యతిరేకిస్తుండగా, అమెరికా పూటకో బుద్ధి ఘడియకో మాట చందంగా ప్రవర్తిస్తోంది. 

1971లో చైనా.. ఇండియా మద్దతుతో శాశ్వత సభ్య దేశంగా అవతరించింది. ఇప్పుడు భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అదే దేశం మోకాలడ్డుతోంది. భారత్‌కు సభ్యత్వం ఇస్తే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్​ వంటి దేశానికి అది వర్తించాలని చైనా సూచిస్తోంది.  

ఇక భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించే అమెరికా, తీరా వ్యవహారం అమీతుమీ తేలే సమయానికి వెనక్కు తగ్గుతోంది. రష్యా మొదట్లో భద్రతా మండలి విస్తరణను వ్యతిరేకించినా, అనంతరం భారత్‌, బ్రెజిల్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా కోరింది. ‘వీటో’ అధికారమిచ్చే అంశంపై మాత్రం స్పష్టత లేదు. 

ఏదిఏమైనా భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు (పీ-5) తమ విశేషాధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగాలేవు. ఈ దేశాలు ‘వీటో’ అధికారాన్ని తరచూ తమ దేశ ప్రయోజనాల రక్షణకే ఉపయోగిస్తూ వచ్చాయి. భారత ప్రధాని మోదీ సారథ్యంలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో శాశ్వత సభ్యత్వంపై మరింత దృష్టి సారించాలి. 

×