Zydus Cadila : త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్..DCGI అనుమతి కోరిన జైడస్ క్యాడిలా

భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది

Zydus Cadila : త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్..DCGI అనుమతి కోరిన జైడస్ క్యాడిలా

Zydus

Zydus Cadila భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా… తమ కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్- డీ(ZyCoV-D)వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐ(Drugs Controller General of India)కి దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం ప్రకటించింది. అనుమతి లభిస్తే ఏటా 120 మిలియన్‌ మోతాదుల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. తాము అభివృద్ధి చేసిన జైకోవ్ డీ..ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్మా డీఎన్ఏ వ్యాక్సిన్ గా జైడస్ క్యాడిల్లా పేరొందింది. ఇది మూడు డోసుల నీడిల్ ఫ్రీ(సూది రహిత)వ్యాక్సిన్ అని,పిల్లలకు సురక్షితమైనదని తెలిపింది.

ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. వ్యాక్సినేషన్‌లో వినియోగిస్తున్నారు. అమెరికా నుంచి మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల సిప్లా సంస్థకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే భారత్ లో అందుబాలోకి రానున్న ఐదో వ్యాక్సిన్ గా జైకోవ్ డీ నిలవనుంది.

కాగా, 12-18 సంవత్సరాల వయసు పిల్లలతో సహా దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై జైడస్ క్యాడిలా క్లినికల్ ట్రయిల్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలో 12-18 ఏళ్ల వయస్సు వారిపై టెస్ట్ చేయబడిన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇదే. రోగలక్షణ కోవిడ్ కేసులపై తమ టీకా 66.6 శాతం సమర్థవంతంగా మరియు మితమైన వ్యాధి కేసులపై 100 శాతం ప్రభావవంతంగా ఉందని జైడస్ సంస్థ పేర్కొంది. ఈ టీకా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సురక్షితం అని కూడా తెలిపింది. కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా పని సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది.మూడు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు పర్యవేక్షిస్తోంది.