Indigo flight: హైదరాబాద్‌ రావాల్సిన విమానం.. భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానం భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

Indigo flight: హైదరాబాద్‌ రావాల్సిన విమానం.. భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

Indigo flight: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగోకు చెందిన 6E-946 విమానం.. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం 4.40గంటలకు బయలుదేరింది.

గాలిలో ఎగిరిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని భువనేశ్వర్‌కు మళ్లించినట్లు చెప్పారు. ఒడిశాలోని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌‌‌కు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశారు. సాయంత్రం 5గంటల 55నిమిషాల సమయంలో విమానం ల్యాండ్‌ అవ్వగా.. వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహించారు. సదరు వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు వైద్యులు.

అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తక్షణ వైద్య సేవలు అందించి, సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్‌లోని ఓ హాస్పిటల్ ఐసీయూకి అతనిని తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా చెప్పారు. మృతుడిని జయబ్రత ఘోష్‌గా గుర్తించారు. మృతుడు ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు.