వీళ్లు మనుషులేనా : ముసలోళ్లను ట్రక్కులో తీసుకెళ్లి..శివారులో వదిలేశారు..వీడియో వైరల్

వీళ్లు మనుషులేనా : ముసలోళ్లను ట్రక్కులో తీసుకెళ్లి..శివారులో వదిలేశారు..వీడియో వైరల్

Indore MC official suspended : మానవత్వం ఉన్న వారిని ఈ వీడియో కదిలించివేస్తోంది. వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతంలో వదిలేశారు. నడిరోడ్డుపైనే దించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం…తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘటన వెలుగు చూసింది.

ఇండోర్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా…ఫుట్ పాత్ లపై నివాసం ఉండే..వృద్ధులను తరలించాలని అధికారులు భావించారు. ఎక్కడైనా..షెల్టర్ కు తరలిస్తే..బాగానే ఉండేది. కానీ..వీరిని బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించారు. ఆ తర్వాత..సిటీకి దూరంగా ఉండే Shipra గ్రామంలో వదిలేశారు. అసలే చలికాలం..ఎలా ఉంటారనే సంగతి వారు మరిచిపోయారు. వారు చేసిన నిర్వాకాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడో ఓ వ్యక్తి. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు కన్నెర్ర చేశారు.

మనుషులేనా అంటూ మండిపడ్డారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ అధికంగా వినిపించాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమాచారం తెలిసింది. వెంటనే మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇలాంటి చర్యలను సమర్థించమని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ సోలంకిని సస్పెండ్ చేసి..తాత్కాలికంగా..భోపాల్ అర్బన్ డెవలప్ మెంట్ డైరెక్టరేట్ కు అటాచ్ చేశారు. ఇద్దరు మున్సిపల్ కార్మికులను సర్వీసు నుంచి తొలగించారు. ఇక..నడిరోడ్డుపై వదిలేసిన ఆ వృద్ధులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆశ్రమానికి తరలించారు. వారిని నగరం వెలుపల ఎందుకు వదిలిపెట్టారనే దానిపై విచారణ జరుగుతోందని ఐఎంసీ అదనపు కమిషనర్ అభయ్ రాజంగోంకర్ (IMC additional commissioner Abhay Rajangaonkar) తెలిపారు.