దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇండోర్, వరుసగా 4వసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కైవసం

  • Published By: naveen ,Published On : August 20, 2020 / 12:15 PM IST
దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇండోర్, వరుసగా 4వసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కైవసం

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 5వ ఎడిషన్ స్వచ్చ సర్వేక్షణ్-2020 ర్యాంకులు ప్రకటించింది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇండోర్(మధ్యప్రదేశ్) నిలిచింది. ఇండోర్, స్వచ్చ సర్వేక్షణ్ పురస్కారం కైవసం చేసుకోవడం ఇది వరుసగా నాలుగోసారి. పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్ తర్వాత రెండో స్థానంలో సూరత్(గుజరాత్), నవీ ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016లో ప్రధాని మోడీ ప్రారంభించారు.



స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. స్వచ్చ మహోత్సవ్ లో భాగంగా పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలు ఇస్తారు. ఈ ఏడాది 4వేల 242 నగరాలు, 62 కంటోన్ మెంట్ బోర్డులు, 92 గంగా పట్టణాలను పరిగణలోకి తీసుకున్నారు. 28 రోజుల పాటు సర్వే నిర్వహించారు. అనంతరం ర్యాంకులు ప్రకటించారు.



తొలి ఎడిషన్ లో దేశంలోనే పరిశుభ్ర నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఇండోర్ పురస్కారం దక్కిచుకుంది. అప్పటి నుంచి వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2017,18,19 సంవత్సరాలలో ఇండోర్ క్లీనెస్ట్ సిటీగా టాప్ ప్లేస్ లో ఉంది. 2019లో రికార్డు టైమ్ లో స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిజిటల్ సర్వే చేశారు. 2014 అక్టోబర్ 2న స్వచ్చ భారత్ అభియాన్ ను కేంద్రం ప్రారంభించింది. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం స్వచ సర్వేక్షణ్ కార్యక్రమం ప్రారంభించారు. దీని లక్ష్యం బహిరంగ మలవిసర్జన రహిత భారత్. పరిశుభ్రమైన భారత్ సాధన దిశగా కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ర్యాంకులు, పురస్కారాలు ఇవ్వడం ద్వారా నగరాల్లో పరిశుభ్రతను పెంచొచ్చని భావిస్తోంది.