కరోనాపై తప్పుడు ప్రచారం : ఉద్యోగం పోగొట్టుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి

  • Published By: chvmurthy ,Published On : March 28, 2020 / 06:16 AM IST
కరోనాపై తప్పుడు ప్రచారం : ఉద్యోగం పోగొట్టుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి

టెక్నాలజీ చేతిలో ఉంది… సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉందాం అనుకున్నాడో ఏమో….. కరోనా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలయ్యాడు ఒక ఇన్పోసిస్ ఉద్యోగి. 
 

” చేయి చేయి కలపండి…బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండి..కరోనా వ్యాప్తి చేయండి ” అని బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తున్న ముజిబ్ మహమ్మద్(25) అనే యువకుడు తను యాక్టివ్ గా ఉండే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  

ఒక వైపు ప్రపంచమంతా కరోనా వ్యాధి భయంతో హడలి పోయి ఇళ్లు వదిలి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తుంటే ఈ పోస్టు మరింత ప్రకంపనలు రేపింది. అతను పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే అది వైరల్ అయ్యింది . దీంతో అలర్టైన పోలీసులు రంగంలోకి  దిగారు. సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి  కేసు నమోదు చేశారు. 
 

ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ కూడా స్పందించింది. తమ సంస్ధకు చెందిన ఉద్యోగి  అనుచితమైన పోస్టు ప్రచారం చేయటం పై దిగ్భాంతి వ్యక్తం చేసింది.  దర్యాప్తుకు ఆదేశించింది. ఇది తమ కంపెనీ ప్రవర్తనా నియమావళికి ,బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది.

అంతర్గత దర్యాప్తు తర్వాత అతణ్ని ఉద్యోగం నుంచీ తొలగిస్తున్నట్లు  ట్విటర్ ద్వారా  ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి చర్యల్ని ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదన్న ఇన్ఫోసిస్ యాజమాన్యం…ఇది అతను అనుకోకుండా చేసిన పొరపాటు కాదని, ఉద్దేశపూర్వంగానే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని వివరించింది.  

కాగా కరోనాను విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇన్ఫోసిస్ బీపీఎం, నాస్కామ్ సహకారంతో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా విదేశాలనుంచి  తిరిగి వచ్చిన  ప్రజలు పాటించాల్సిన స్వీయ-నిర్బంధ పద్ధతులు, పరీక్షా సౌకర్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనావైరస్ బారిన పడిన పౌరుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, వైద్య సదుపాయాల విషయంలో అక్కడి  ప్రభుత్వానికి మద్దతు నందిస్తోంది.