ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్

ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్

vaccination

second stage vaccination : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అన్ని రాష్ట్రాలూ ఏర్పాట్లు చేశాయి. కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ సంఖ్య ద్వారా cowin.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వారంలో కనీసం నాలుగు రోజులకు తగ్గకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్రాల్లో ఏర్పాటు జరుగుతున్నాయి.

అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు.. ఆయుష్మాన్‌ భారత్‌ అమలుచేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్‌ కోసం కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో పేరు నమోదు చేసుకుంటేనే టీకా ఇవ్వాలన్న నిబంధన కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పుడు కూడా ఇదే నిబంధన కొనసాగినా… రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే టీకా తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళితే తక్షణమే టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేసినా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులే అని తెలంగాణ వైద్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామన్నారు. ప్రైవేటులో 215 ఆసుపత్రులకు వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు అనుమతి ఉందన్నారు. అందరూ మొదటి రోజే వ్యాక్సిన్‌ తీసుకోవాలని అనుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని… వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెలంగాణలో 60 ఏళ్లకు పైబడిన వారు, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు 50 లక్షల మంది ఉంటారని అంచనా. రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 138 సెకండరీ కేర్‌ ప్రభుత్వ ఆస్పత్రులు, 23 టెరిషియరీ కేర్‌ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌ కలిగిన 333 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. నేటి నుంచి వీటన్నింటిలో టీకా రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ రిజిస్ట్రేషన్‌… ఆ వెంటనే టీకా ఇస్తారు. జూన్‌, జులైలోగా ఈ వర్గాలకు రెండు డోసులు ఇవ్వడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.