కాలు లేకపోయినా స్టిక్‌తో పరుగు పందెంలో పాల్గొన్న చిన్నారి హార్ట్ టచింగ్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 06:24 AM IST
కాలు లేకపోయినా స్టిక్‌తో పరుగు పందెంలో పాల్గొన్న చిన్నారి హార్ట్ టచింగ్ వీడియో

లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి. నీ వెనుక ఏముంది…నీ ముందు ఏముంది… అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం అని స్వామీ వివేకానందుడు అద్భుతమైన సందేశాలను అక్షరాలా నిజం చేసింది ఓ చిన్నారి. అంగవైకల్యం ఉన్నా..వెనుకాడకుండా పరుగు పందెంలో పాల్గొన్న ఓ చిన్నారి స్ఫూర్తిదాయంకమైన  ఈ వీడియో నెటిజన్లు ఫిదా చేస్తోంది. 

భారతీయ అటవీశాఖ అధికారి సుశాంత నందా షేర్ చేసిన ఈ వీడియోను చూసిన ప్రతీవారు ఆ చిన్నారి సంకల్ప బలాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. కేవలం 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆరుగురు చిన్నారులు పరుగుపందెంలో పాల్గొన్నారు. వారిలో ఓ చిన్నారికి అంగవైకల్యం ఉంది. స్టిక్ తో పందెంలో పాల్గొంది.

ఈ పందెంలో మిగిలిన ఐదుగురితో పాటు తాను కూడా పరిగెత్తింది. కానీ ఇక్కడ ఆ చిన్నారి గెలిచిందా లేదా? అనేది ముఖ్యం కానేకాదు. చక్కటి ఆరోగ్యం కలిగిన తోటి పిల్లలతో కలిసి తనలోని వైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా..వారితో నేను పోటీ పడగలనా? గెలుస్తానా? ఓడిపోతానా? అని ఏమాత్రం ఆలోచించలేదు. 

పోటీలో పాల్గొనాలి..పరుగెత్తాలి. విజయమా? అపజయమా? నాకు అవసరం లేదు.ప్రయత్నించాలి అనే ఆ చిన్నారి మనోధైర్యాన్ని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వే అసలైన విజేతవి అంటూ ప్రశంసిస్తున్నారు.

యుగకవి శ్రీశ్రీ అన్నట్లుగా ఏదీ తానంతట నీ దగ్గరకు రాదు..పోరాడి సాధించటమే అదియే వీర గుణం అని పలికిన అమృతతుల్యమైన వాక్కులకు ప్రతిరూపంగా ఉంది ఈ చిన్నారి. ఈ వీడియోలో చిన్నారి విజయం కోసం పరిగెత్తలేదు. నేను ఎవరికీ తక్కువ కాదు  కూడా పరుగెత్తగలను అని నిరూపించమే నిజమైన విజయం కదా.