Mizoram MP : అసోం-మిజోరాం సరిహద్దు ఘర్షణ..ఎంపీ పాత్రపై దర్యాప్తు

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం అధికార పార్టీ ఎంపీ కే. వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు.

Mizoram MP : అసోం-మిజోరాం సరిహద్దు ఘర్షణ..ఎంపీ పాత్రపై దర్యాప్తు

Border Fight

Mizoram MP  అసోం-మిజోరాం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం అధికార పార్టీ ఎంపీ కే. వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల హత్య కుట్రలో ఎంపీ కీలక పాత్ర పోషించినట్లు ఆయన అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ హిందీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వన్లాల్వేనా.. దాడికి సంబంధించిన సంకేతాలిచ్చారని పోలీసులు తెలిపారు. మిజోరాం భూభాగంలోకి వచ్చిన తర్వాత చనిపోకుండా తిరిగివెళ్లిన అసోం పోలీసులందరూ చాలా అదృష్టవంతులని ఇంటర్వ్యూలో వన్లాల్వేనా తెలిపారు. అంతేకాకుండా, అసోం పోలీసులు ఎవరైనా మిజోరాం భూభాగంలోకి మరోసారి ప్రవేశిస్తే వారందరూ చంపబడతారని ఎంపీ వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు చేసిన అసోం పోలీసులు.. ఎంపీపై చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి పోలీసులు, సీఐడీ అధికారులు దిల్లీకి బయలుదేరనున్నట్లు తెలిపారు. ఇక,మిజోరాం పోలీసులు, పౌరులు అసోం పోలీసులపై జరిపిన దాడికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు అసోం స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. దాడి జరిపిన వారి సమాచారం తెలిపిన వాళ్లకు రూ.5 లక్షల రివార్డ్​ను సైతం ఆయన ప్రకటించారు.

కాగా, రెండు రోజుల క్రితం అసోం- మిజోరాం సరిహద్దులోని లైలాపూర్ వద్ద ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. మిజోరాం వైపు నుంచి కొంతమంది అసోం పరిధిలోని ప్రాంతాలను ఆక్రమించేందుకు వచ్చినవారిని అసోం పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కర్రలు, రాళ్లు, అధునాతన ఆయుధాలను చేతబట్టిన మిజోరం బృందం.. అసోం పోలీసులపై దాడి చేసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. మిజోరం వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

రంగంలోకి కేంద్ర బలగాలు

ఇక,అసోం-మిజోరాం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు బుధవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బుధవారం ఢిల్లీలో అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే సింగ్‌లతో సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ భేటీలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో 306వ నంబరు జాతీయ రహదారి వెంట తటస్థ కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్‌) మోహరించేందుకు అంగీకారం కుదిరింది. ఈ సాయుధ సిబ్బందికి సీఏపీఎఫ్‌లోని సీనియర్‌ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ సమన్వయంతో రెండు రాష్ట్రాలు సముచితమైన సమయంలోగా అవసరమైన ఏర్పాట్లు చేస్తాయి.