‘ఏ పబ్జీ వాలా హై క్యా’ : మోడీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ 

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 08:35 AM IST
‘ఏ పబ్జీ వాలా హై క్యా’ : మోడీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ 

ఢిల్లీ : విద్యార్ధులకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోటీవేషన్ స్పీచ్ ఇచ్చారు. 24 రాష్ట్రాల విద్యార్ధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోకోమ్యాన్, బ్లూవేల్ పోయి.. పబ్జి ఫోబియా జనాన్ని పట్టి పీడిస్తుంది. పిల్లల్నుంచి పెద్దల వరకు పబ్జి గేమ్‌‌కు అడిక్ట్ అయిపోతున్నాడు. కాస్త టైం దొరికితే చాలు అందులో మునిగిపోతున్నారు. ఫోన్ వదలకుండా గంటల తరబడి కూర్చుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పరీక్షపై చర్చా కార్యక్రమంలో కూడా ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది.

 

మా అబ్బాయి పబ్జి గేమ్ గంటలతరబడి ఆడుకుంటూ ఉంటున్నాడని ఓ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినడం లేదని.. పిల్లలకు ఈ గేమ్ నుంచి దూరంగా ఎలా ఉంచాలో సలహా ఇవ్వాలంటూ మోడీని కోరింది. దీనిపై స్పందించిన మోడీ ”ఏ పబ్జి వాలా హై క్యా” అంటూ సరదాగా తన సందేశాన్నివ్వడం ప్రారంభించారు. ఇదే సమస్య… ఇదే సమాధానం అన్నారు. ఈ రోజుల్లో పిల్లలు టెక్నాలజీని దూరంగా ఉంచితే వారు చాలా వెనక్కి వెళ్లిపోతారన్నారు. ఓ విధంగా టెక్నాలజీ వచ్చి చాలామందిని రోబోలుగా తయారు చేస్తుందన్నారు. అందుకే సాంకేతికతను ఎలా వినియోగించాలన్న దానిపై పిల్లల్లో అవగాహన తీసుకురావాలన్నారు. టెక్నాలజీలో రోజురోజుకు వస్తున్న కొత్త కొత్త మార్పుల పట్ల పిల్లలతో.. తల్లిదండ్రులు రోజు చర్చించాలన్నారు.

 

ఈరోజు ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్ తప్పక కనిపిస్తుందని..ఈ కాన్ఫరెన్స్‌లో కూర్చున్న చాలామంది కూడా ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తున్నారంటూ సరదాగా ప్రధాని మాట్లాడారు. అయితే టెక్నాలజీని మనం అభివృద్ధి కోసం వాడాలన్నారు. అలా కాకుండా దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు సాంకేతికతపై. వాటి వినియోగంపై అవగాహన తీసుకురావాలన్నారు. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు… టెక్నాలజీని మిస్ యూజ్ చేయరని చెప్పుకొచ్చారు మోడీ.

 

పరీక్షలంటే భయపడొద్దు..జీవితమనే సవాల్‌ని ఫేస్ చేయాలి: మోడీ  
విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదని..జీవితమనే సవాల్‌ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్‌తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 2వేల మంది విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించిన ఆయన, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

 

పరీక్షలను జీవన్మరణ సమస్యగా ఎన్నడూ చూడవద్దని సూచించిన ప్రధాని, అసలైన సవాలు జీవితమని గ్రహించాలని అన్నారు. దేశ భవిష్యత్తు ఈ విద్యార్థులదేనని, తనకు దేశ భవిష్యత్ కనిపిస్తోందని చెప్పారు.పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించేందుకు మెలకువలను చెప్పిన మోడీ, క్రమానుగుణంగా పాఠ్యాంశాలను చదవడం ద్వారా చాలా సులువుగా ఉత్తీర్ణతను సాధించవచ్చని అన్నారు. ర్యాంకులను మాత్రమే చూడరాదని, ర్యాంకులు తెచ్చుకోలేని ఎంతో మంది విద్యార్ధులు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుని ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.