Corona Second Wave : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వమే కారణం : ఇంటర్‌నేషనల్ మీడియా

కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Corona Second Wave : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వమే కారణం : ఇంటర్‌నేషనల్ మీడియా

Corona Second Wave

International media criticism of corona Second wave in India : కరోనా సెకండ్ వేవ్‌….దేశంలో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపుతోంది. ఆస్పత్రుల్లో ఒక్క బెడ్‌ కోసం రోగులు అలమటిస్తున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి ఏడాది క్రితమే భారత్‌లో ప్రవేశించింది. ప్రపంచంలో అందరికంటే ముందే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. దాదాపు 80 దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను పంపించాం కానీ… ఏడాది కాలంలో కట్టడి చర్యలు చేపట్టడంలో మాత్రం పురోగతి సాధించలేకపోయాం. దీంతో.. ఏడాది సమయమున్నా….సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వేవ్ టైంలోనే ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించుకుని ఉంటే..కరోనా మరణ మృదంగం నుంచి భారత్ తప్పించుకుని ఉండేదని ఇంటర్నేషనల్ మీడియా తలంటింది. చివరకు మనకంటే చాలా చిన్నదైనా దాయాది దేశం పాకిస్థాన్ కూడా మనకు సాయం చేస్తాం అని ప్రకటించే స్థాయికి దేశ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ మీడియా కోడై కూస్తోంది.

భారత్‌లో సెకండ్ వేవ్ పాపం ఎవరిది..? కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇండియాలో కరోనా కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌లో కరోనా పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా జోరుగా కథనాలు ప్రచురిస్తోంది. వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌, ఏబీసీ వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితులపై పలు వార్తలు ప్రచురించాయి. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చురుకలు వేసింది. ముందుగానే కరోనా ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించింది. అతి విశ్వాసమే భారత్ కొంపముంచిందంటూ- ది గార్డియన్ పత్రిక- తన ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

భారత్‌లోని ప్రస్తుత పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలని హెచ్చరించింది. అలాగే ప్రభుత్వం తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా తీవ్రతరం కావడానికి కారణమని న్యూయార్క్‌ టైమ్స్‌ స్పష్టం చేసింది. అలసత్వం వల్లే – కరోనా కట్టడిలో విజయం దిశగా వెళ్తున్న భారత్‌‌లో కథ ఒక్కసారిగా మారిపోయిందని విశ్లేషించింది. భారత్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావంచ చూపే అవకాశం ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్లను నిరోధించడం, టీకాలు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే ప్రస్తుతం భారత్ ముందున్న మార్గమని న్యూయార్క్‌ టైమ్స్‌ స్పష్టం చేసింది.

కరోనా నిబంధనలను తేలికగా తీసుకోవడం వల్లే భారత్‌లో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ తేల్చింది. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవికావని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో నిర్లక్ష్యం, ప్రజల్లో అలసత్వంతోపాటు కొత్త వేరియంట్లు ప్రస్తుత పరిస్థితికి కారణమని వివరించింది. భారత్‌లో కేసుల సంఖ్య పెరగడానికి, ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ టైమ్స్ కడిగి పారేసింది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాజకీయంగా పై చేయి సాధించడంపై దృష్టి పెట్టడంతో వైరస్‌ కట్టడిలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

కోవిడ్‌ను అడ్డుకోవడంలో రక్షణాత్మక విధానాన్ని పట్టించుకోకపోవడం వల్ల భారత్ మరిచిపోలేని తప్పు చేసిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా కథనాన్ని ప్రచురించింది. భారత్‌‌ ఆస్పత్రుల్లో కనిపిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేసేలా ఉన్నాయని పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది. ఇలా భారత్‌లో పెరుగుతున్న కరోనాపై ఇతర దేశాలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఒకానొక సమయంలో మందులు, వ్యాక్సిన్‌, మెడికల్ ఎక్విప్‌మెంట్ కోసం మనదేశంపై ఆధారపడిన ఇతర దేశాలు కూడా భారత్‌ గురించి విశ్లేషించడాన్ని చూస్తుంటే.. దేశంలో ఏ స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతోంది.

ఒకప్పుడు అంతర్జాతీయ మీడియా భారత ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసేది. నిర్ణయాలపై ప్రశంసలు కురిపించేవి. కానీ ప్రశంసించిన నోళ్లే ఇప్పుడు తిడుతున్నాయి. గొప్ప పాలన అంటూ కీర్తించిన అక్షరాలు ఇప్పుడు.. ట్రంప్‌తో పోలుస్తూ ఎగతాళి చేస్తున్నాయి. దేశంలో కరోనా పరిస్థితికి – కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే కారణమంటూ అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఎకనమిస్ట్, గార్డియన్ , న్యూయార్క్ టైమ్స్, స్కైన్యూస్ , టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు.. కరోనా కట్టడిని తప్పుబడుతున్నాయి.

సెకండ్ వేవ్ గురించి నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి – ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహించి, బడులు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌ తెరచి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని విశ్లేషిస్తున్నాయి. అంతే కాదు.. భారతీయులకు వైద్య సౌకర్యాలు ఎంత నాసిరకంగా అందిస్తున్నారో కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ దొరక్క కారిడార్లలోనే రోగులు మరణించడం.. శ్మశానాల ఎదుట క్యూలు కట్టడం లాంటి ద్రుశ్యాలను – ప్రపంచం ముందు పెట్టి.. కడిగిపారేస్తున్నాయి.