నిత్యానందపై ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీస్

  • Published By: venkaiahnaidu ,Published On : January 22, 2020 / 01:10 PM IST
నిత్యానందపై ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీస్

రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి నిత్యానందను పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న స్వామి నిత్యానందకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అదృశ్యమైన లేదా నేర నిర్థారణ జరిగిన లేదా నేర నిర్థారణ జరగని లేదా సాధారణ క్రిమినల్ చట్టాలను ఉల్లంఘించినందుకు పట్టుబడవలసిన వ్యక్తి ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవడానికి బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తారు.
 
గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాష్ట్రంలోని నిత్యానంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అద‌‌ృశ్యమవడంతో గత ఏడాది నవంబరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు స్థానిక కోర్టులో ఓ అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి కృషి జరుగుతోంది. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయితే నిత్యానందను అరెస్టు చేయడానికి వీలవుతుంది.

మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్‌ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ డిసెంబర్-6,2019న తెలిపింది. తాను కొత్త దేశం ఏర్పాటు చేసుకున్నట్లు దానికి ఓ జెండాను కూడా రూపొందించినట్లు ఇటీవల నిత్యానంద ఓ వెబ్ సైట్ ద్వారా తెలియజేయగా… ఒక దేశం ఏర్పాటు చేయడం అనేది వెబ్ సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ తెలిపారు.