ఉదయం పెళ్లి చేసుకుంటున్నారు..సాయంత్రం జైలుకు వెళుతున్నారు..యువతుల పెళ్లిళ్లపై న్యాయమూర్తుల ఆశ్చర్యం

10TV Telugu News

పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే వరుడు జైళ్లకు వెళుతుండడం, ఖైదీలను పెళ్లి చేసుకుంటున్నామనే విషయం యువతులకు తెలిసే జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. విచారణ జరపాలని జాతీయ మహిళా కమషన్ ను ఆదేశించారు.యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు పెరోల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఓ యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. యావజ్జీవ ఖైదీ అనే విషయం ఆ యువతికి తెలియదా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.

ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్‌ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఇలాంటివివే మరికొన్ని కేసులు దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్‌ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య పిటిషన్‌ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని, పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు తనను పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. కానీ అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారింట్లో ఉన్నట్లు తెలిపింది.

ఓ ఖైదీని, అందులో యావజ్జీవ ఖైదీని పెళ్లి చేసుకొనేందుకు ఏ యువతి అంగీకరించదని, అసలు యువతుల ఇష్ట ప్రకారం జరుగుతున్నాయా ? లేక బలవంతంగా చేస్తున్నారా ? అన్న దానిపై విచారణ చేసి పిటిషన్‌ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు.


10TV Telugu News