చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 09:11 AM IST
చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చింది. సోమవారం(ఆగస్టు-26,2019) వ‌ర‌కు ఆ వెస‌లుబాటు క‌ల్పించారు.

అయితే ఇదే కేసులో రెండు రోజుల క్రితం చిదంబ‌రాన్ని హైడ్రామా మ‌ధ్య సీబీఐ అరెస్టు చేయడం, నిన్న సీబీఐ కోర్టులో హాజరుపర్చడం, కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పజెబుతూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే INX మీడియా కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ రెండు రోజుల క్రితం చిదంబరం సుప్రీంలో పిటిషన్ వేయగా.. ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్‌కు సంబంధించి వాద‌న‌లు జ‌రిగాయి. సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టులో త‌న వాద‌న వినిపించారు. చిదంబ‌రానికి వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌న్నీ డిజిటల్ డాక్యుమెంట్లు, ఈ-మెయిళ్ల రూపంలో ఉన్న‌ట్లు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. మ‌నీల్యాండ‌రింగ్ ప‌ద్ధ‌తిలో అవినీతి సొమ్ము మాయ‌మ‌యింద‌న్నారు.

చిదంబ‌రానికి విదేశాల్లో 10 ప్రాప‌ర్టీలు, 17 బ్యాంకు అకౌంట్లు ఉన్న‌ట్లు తుషార్ మెహ‌తా చెప్పారు. అయితే సోమ‌వారం రోజున సీబీఐ, ఈడీ కేసుల‌ను సుప్రీం విచారించ‌నున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలోనే ఉంటారని కోర్టు చెప్పింది. చిదంబ‌రానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లును సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కోర్టుకు స‌మ‌ర్పించే ప్ర‌య‌త్నం చేశారు. చిదంబరం తరపున వాదిస్తున్న లాయ‌ర్లు సిబ‌ల్‌, సింఘ్వీలు దాన్ని అడ్డుకున్నారు. ప్ర‌తి అంశాన్ని సోమ‌వార‌మే వింటామ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.