కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2020 / 12:45 PM IST
కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం

ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం కూడా కరోనా వ్యాధి బారిన పడి గురువారం రాత్రి మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఈ సమయంలో ఇరాన్ లో ఉన్న భారతీయులను దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. అటు ఇరాన్ కూడా భారతలో ఉన్న తమ వాళ్లను తిరిగి తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభించింది.

అయితే ఇందులో భాగంగా ఇరాన్ లో నిలిచిపోయిన 300మంది బ్లెడ్ శాంపిల్స్ తో ఇరాన్ కు చెందిన ఓ విమానం శుక్రవారం(మార్చి-6,2020)రాత్రి ఢిల్లీలో ల్యాండ్ కానుంది. ఇరాన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు ఇప్పటికే డీజీసీఏ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే విమానం తిరుగు ప్రయాణంలో భారత్ లో నిలిచిపోయిన తమ దేశస్థులను తీసుకెళ్లనుంది. ఇరాన్ విమానంలో తీసుకొచ్చే 300మంది భారతీయుల శాంపిల్స్ కు కరోనా టెస్ట్ లు భారత్ లో చేయబడతాయి.

ఆ పరీక్షల్లో నెగిటీవ్ అని తేలితేనే ఇరాన్ లో నిలిచిపోయిన భారతీయులను ప్రభుత్వం తిరిగి దేశానికి తీసుకొస్తుంది. దాదాపు 2వేలమంది ఇరాన్ లో భారతీయులు ఉండగా, ఇందులో ఎక్కువమంది ఇరాన్ కు యాత్రకు వెళ్లిన కార్గిల్ ప్రాంతానికి చెందిన వాళ్లు ఉన్నారు. వీళ్లందరూ కరోనా నేపథ్యంలో కమర్షియల్ ఫ్లైట్స్ రద్దు కావడంతో ఇరాన్ నుంచి భారత్ కు తిరిగి రాలేకపోయిన విషయం తెలిసిందే. 

ఇరాన్ లో నిలిచిపోయిన భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ ప్రారంభించేందుకు అధికారులు ఇరాన్ తో టచ్ లో ఉన్నారని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ తెలిపారు. దాదాపు 2వేలమంది ఇరానియన్లు భారత్ లో ప్రస్తుతం ఉన్నారని,విమానాల్లో వాళ్ల దేశానికి వాళ్లు తిరిగివెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులు తరలింపు విమానంలో ఎక్కేముందు వారిని క్షుణ్ణంగా పరిశీలించారని నిర్ధారించడానికి భారత వైద్యుల బృందాన్ని ఇప్పటికే ఇరాన్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

ఏప్రిల్ మొదటివారం వరకు స్కూల్స్,కాలేజీలు,యూనివర్శిటీలు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా పెద్ద కల్చరల్,స్పోర్టింగ్ ఈవెంట్స్ ను ఇరాన్ రద్దు చేపింది. దేశవ్యాప్తంగా పనిగంటలను కూడా తగ్గించింది.