వైన్ షాపు ముందు పశువుల పాక.. దెబ్బకి ఎత్తేసిన యజమానులు

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 04:54 AM IST
వైన్ షాపు ముందు పశువుల పాక.. దెబ్బకి ఎత్తేసిన యజమానులు

ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఇష్టానురీతిగా పెట్టేస్తున్నారు. తాగి న్యూసెన్స్ చేస్తున్నారు మందుబాబులు. దీంతో స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  గుడి, బడి ఉన్న ప్రాంతాల్లోనూ వైన్ షాపులు వచ్చేశాయి. కంప్లయింట్స్ ఇచ్చినా పట్టించుకోవటం లేదని.. స్థానికులు ఓ ఐడియా వేశారు. అంతే.. దెబ్బకి షాపు మూతపడింది.. ఈ ఐడియా ఏంటో చూద్దాం..
 
పంజాబ్‌ రాష్ట్రం. మొహాలీ ప్రాంతంలోని కుంభ్రా గ్రామం. సెక్టార్-69లో మద్యం షాపు ఉంది. తొలగించాలని కొన్నాళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు మద్యానికి బానిసగా మారటంతోపాటూ రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వైన్ షాపు వారికి చెప్పినా పట్టించుకోలేదు. అధికారులకు చెబితే కంప్లయింట్ తీసుకుని లైట్ తీసుకున్నారు. లాభం లేదనుకున్న స్థానికులే రంగంలోకి దిగారు. వైన్ షాపు ఎదుట పశువుల పాక పెట్టారు. ఆ పశువులకు అక్కడే మేత వేయటం, పాలు పితకటం మొదలుపెట్టారు. రెండు రోజులు ఇలా చేశారో లేదో.. వైన్ షాపు చుట్టూ రొచ్చురొచ్చుగా మారింది.

దీంతో వైన్ షాపుకు వచ్చే వాళ్లు తగ్గిపోయారు. బిజినెస్ ఎత్తిపోయింది. అంతే.. వైన్ షాపు క్లోజ్ చేశారు యజమానులు. గ్రామానికి చెందిన గుర్మీత్‌సింగ్, కమల్ ప్రీత్ సింగ్, జగదీష్ సింగ్ మాట్లాడుతూ ప్రజలంతా ఒక్కమాటపై నిలిచామన్నారు. మద్యం షాపు వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నామని.. అందుకే నిరసనను ఈ రకంగా తెలియజేశామని తెలిపారు. మద్యం షాపు ముందు నుంచి స్కూల్ కు వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారనీ.. ఇదే ప్రాంతంలో ఓ ఆస్పత్రి కూడా ఉందని వివరించారు గ్రామస్తులు. షాపు దగ్గరే తాగి అల్లరి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందరూ ఒక్కటి అయితే.. సమస్య ఎంతటిది అయినా ఇట్టే పరిష్కారం అవుతుంది అనటానికి ఇదే నిదర్శనం.. హ్యాట్సాఫ్ టూ..