ISRO Shukrayaan-I : వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టిన ఇస్రో..రహస్యాల గుట్టు విప్పుతామంటున్న శాస్త్రవేత్తలు

వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టింది ఇస్రో. భూమిని పోలి ఉండే శుక్ర గ్రహంపై రహస్యాల గుట్టు విప్పుతామంటున్నారు శాస్త్రవేత్తలు.

ISRO Shukrayaan-I : వీనస్ గ్రహంపై ఫోకస్ పెట్టిన ఇస్రో..రహస్యాల గుట్టు విప్పుతామంటున్న శాస్త్రవేత్తలు

Isro Planning Mission To Venus, Eyeing December 2024 Launch Window

ISRO Shukrayaan-I : భూమికి ట్విన్ సిస్టర్ లాంటి వీనస్ పై ఫోకస్ పెట్టింది మన ఇస్రో. చంద్రుడు, అంగారకుడిపై ఇప్పటి వరకు చాలా దేశాలు పరిశోధనలు చేశాయి. కానీ వీనస్ పై పెద్దగా ఎవ్వరు దృష్టి పెట్టలేదు. అందుకే ఇస్రో వీనస్ గుట్టు విప్పుతానంటోంది. దీని కోసం 2024లో భారీ ప్రయోగానికి సిద్ధ చేస్తోంది ఇస్రో.సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం వీనస్..సల్ఫ్యూ రిక్‌ యాసిడ్‌ మేఘాలతో విషపూరితంగా ఉండే గ్రహం. భగభగ మండే శుక్రుడిపై జీవం ఉంటుందా? వీనస్‌ గుట్టు విప్పబోతున్న ఇస్రో..2024 డిసెంబర్‌లో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది.

అంతరిక్షంలోకి ఎన్నో ఉపగ్రహాల్ని పంపి రహస్యాల్ని ఛేదించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. ఈసారి శుక్ర గ్రహంపై కన్నేసింది. సౌరమండలంలోనే అత్యంత వేడిగ్రహంగా ఉన్న వీనస్‌ రహస్యాల గుట్టు విప్పేందుకు సై అంటోంది. 2024 డిసెంబర్​లో ఈ ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ప్రయోగానికి అవసరమైన నిధులు కూడా సమకూరినట్లు చెప్పారు. తక్కువ సమయంలోనే ప్రయోగం నిర్వహించే సత్తా, సామర్థ్యం భారత్‌ దగ్గర ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Also read : ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

వీనస్‌ పేరు చెప్పగానే అందరిలోనూ ఏదో ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. ఎందుకంటే భూమికి, వీనస్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే భూమికి సిస్టర్‌గా పిలుస్తారు. ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల ప్రయోగాలన్నీ చంద్రుడి, అంగారకుడి వరకే పరిమితమయ్యాయి. కానీ వీనస్‌పై ఏ ఒక్కరూ ఫోకస్‌ పెట్టలేదు. సూర్యుడికి దగ్గరగా ఉండడంతో అక్కడ నీటి జాడలు కానీ.. జీవరాశి కానీ ఉండే అవకాశమే ఉండదని ఫిక్సైన శాస్త్రవేత్తలు.. దాన్ని పట్టించుకోవడం మానేశారు. కానీ.. ఇస్రో మాత్రం అలాంటి తప్పు చేయట్లేదు. కచ్చితంగా వీనస్‌పై మనకు తెలియని ఏదో ఒక రహస్యం ఉంటుందని భావిస్తోంది. దాన్ని తెలుసుకునేందుకు 2024లో శుక్రయాన్‌ ప్రయోగం చేపడుతోంది.

వీనస్‌పై భారత్‌ చేస్తున్న తొలి ప్రయోగం ఇదే. శుక్రయాన్‌లో భాగంగా ప్రయోగించే ఉపగ్రహం నాలుగేళ్ల పాటు సేవలందించనుంది. జీఎస్‌ఎల్వీ తయారు చేసిన GSLV MK 2 లేదా GSLV MK 3 రాకెట్లతో ఈ వీనస్‌ ఆర్బిటర్‌ను ప్రయోగించనున్నారు. ఇది చాలా పరికరాల్ని శుక్రగ్రహంపైకి మోసుకుపోనుంది. ఆ గ్రహం ఉపరితలం, వాతావరణం నిర్మాణంతో పాటు అయానో స్పియర్‌తో సౌరగాలి పరస్పర చర్యపైనా అధ్యయనం చేయనుంది. వాస్తవానికి 1960 ప్రారంభంలోనే వీనస్‌ అన్వేషణ మొదలైంది. దానిపైకి కొన్ని ల్యాండర్లు పంపించి అక్కడి వాతావరణంపై అధ్యయనం చేశారు. అయితే ఈ ప్రయోగాలతో పెద్దగా రహస్యాలేవీ బయటపడలేదు.

Also read : Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

శుక్రుడు భూమిని పోలిన గ్రహం కావడంతో అందరిలోనూ ఆసక్తి ఎక్కువే. ఆ మధ్య శుక్ర గ్రహంపై ఆవరించిన వాతావరణంలో జీవం ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలా చెప్పడం వెనుక ఓ కారణముంది. ఆ గ్రహం మీద ఒక వాయువుకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నారు. శుక్రుడిపై ఉన్న ఆ గ్యాస్‌ పేరు ఫాస్ఫిన్. ఒక ఫాస్ఫరస్‌ అణువుతో మూడు హైడ్రోజన్‌ అణువులు కలవడంతో ఈ వాయువు ఏర్పడుతుంది. ఆ గ్యాస్‌ శుక్రుడి ఉపరితలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫాస్ఫిన్ భూమి మీద జీవంతో ముడిపడి ఉన్న వాయువు. పెంగ్విన్‌ కడుపులో ఇది ఉంటుంది. ఆక్సిజన్‌ తక్కువగా ఉండే చిత్తడి నేలల్లో బతికే సూక్ష్మజీవులు.. ఈ ఫాస్ఫిన్‌లో మనుగడ సాగిస్తాయి. శుక్రుడి మీద ఫాస్ఫీన్‌ ఉన్నట్లు జేమ్స్‌ క్లార్క్‌ మాక్స్‌వెల్ టెలిస్కోప్‌ సహాయంతో గుర్తించారు. దీంతో శుక్రగ్రహాన్ని చేరుకుని.. అక్కడ అసలు జీవం ఉందా ? లేదా అని తేల్చడంతో పాటు ఇతర రహస్యాల గుట్టు కూడా మన ఇస్రో విప్పనుంది.

వీనస్‌పై మన దేశం ఒక్కటే కాదు.. అమెరికా లాంటి అగ్రరాజ్యాలూ ఫోకస్‌ చేశాయి. ఉన్నట్టుండి అది నిప్పుల గోళంగా ఎలా మారిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉబలాట పడుతున్నాయి. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ స్పేస్ క్రాఫ్ట్‌ పంపనుంది. అందుకోసం 100 కోట్ల డాలర్లను ప్రస్తుతానికి కేటాయించింది. డావిన్సి, వెరిటాస్ పేరుతో రెండు మిషన్లను చేపట్టనుంది. 2028 నుంచి 2030 మధ్య ఆ రెండు ప్రయోగాలు నిర్వహించనుంది. అంతేగాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఎన్విజన్ పేరిట మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వీనస్ కక్ష్యలోకి ఆర్బిటర్‌ను పంపనుంది.