తమిళనాడులో ఐటీ సోదాలు..రూ.1000కోట్ల “బ్లాక్ మనీ” గుర్తింపు

తమిళనాడులో ఐటీ సోదాలు..రూ.1000కోట్ల “బ్లాక్ మనీ” గుర్తింపు

IT Dept వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు జ‌రిపిన సోదాల్లో భారీగా అక్ర‌మాస్తులు బ‌య‌ట‌పడ్డాయి. బులియ‌న్ ట్రేడ‌ర్‌, ద‌క్షిణ భార‌త‌దేశంలో అతిపెద్ద జువెల‌రీ రిటెయిల‌ర్‌పై జ‌రిగిన ఈ దాడుల్లో ఏకంగా రూ.1000 కోట్ల అక్ర‌మాస్తులు దొరికిన‌ట్లు ఆదివారం సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్‌ (CBDT) వెల్ల‌డించింది.

మార్చి 4న చెన్నై, కోయంబ‌త్తూర్‌, మ‌దురై, తిరుచిరాప‌ల్లి,ముంబై,త్రిసూర్‌, నెల్లూరు, జైపూర్‌, ఇండోర్‌ ల‌లో ఏక కాలంలో 27 చోట్ల ఈ దాడులు జ‌రిగినట్లు తెలిసింది. అయితే ఎవ‌రిపై దాడులు చేయబడ్డాయో వారి పేర్లను మాత్రం సీబీడీటీ వెల్లడించలేదు. ఈ సోదాల్లో సుమారు రూ. 1000 కోట్ల మేర లెక్క తేలని ఆదాయాన్ని అధికారులు గుర్తించారని తెలిపింది.

బులియన్ వ్యాపారి సంస్థల్లో లెక్క తేలని ఆదాయం లభించినట్టుగా చెబుతున్నారు. బోగస్ క్యాష్ బిల్లులు, డమ్మీ అకౌంట్ల ద్వారా నగదు క్రెడిట్ అయినట్టుగా గుర్తించారు. జ్యూయల్లరీ వ్యాపారి నుండి కీలక పత్రాలను స్వాధీనం ,చేసుకొన్నట్లు సమాచారం. ఇక, త‌మిళ‌నాడులో ఏప్రిల్ 6న ఒకే ద‌శ‌లో 234 స్థానాల‌కు ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సమయంలో ఐటీ దాడుల్లో పెద్ద సంఖ్యలో బ్లాక్ మనీ బయటపడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.