సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడం కష్టమే!

సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడం కష్టమే!

కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడావుడి కంటే.. తక్కువగా హడావుడి ఉంటుందని, అందరూ భావించినా.. సంక్రాంతికి ఊర్లకు వెళ్లాలని అనుకునేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ, ఈ ఏడాది కూడా హడావుడి తక్కువ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఇందుకు నిదర్శనం తెలుగు రాష్ట్రాలకు వెళ్తున్న రైళ్ల బెర్త్‌లు ఇప్పటికే ఫుల్ కావడమే.

సంక్రాంతికి సొంత ఊరు వెళ్లాలని ప్లాన్ చేసుకునే నగరవాసులకు ప్రత్యేక రైళ్లు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లలో బుకింగ్ చేసుకోవాలంటే వెయిటింగ్‌ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. వచ్చే జనవరి చివరివరకు రైళ్లలో రిజర్వేషన్‌లు అన్నీ భర్తీ అయ్యాయి. ప్రత్యేక రైళ్లు కొత్తగా కొన్ని నడిపితే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 80 రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను, మరో 120కు పైగా ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా.. వాటి స్థానంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దశల వారీగా పరిమితంగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది రైల్వేశాఖ.

సికింద్రాబాద్‌-ఢిల్లీ, బెంగళూర్‌-న్యూఢిల్లీ మధ్య కేవలం రెండు సర్వీసులతో కోవిడ్‌ అన్‌లాక్‌ నిబంధనల మేరకు రైళ్లను నడుపుతుండగా.. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, ముంబయి, దానాపూర్, తదితర ప్రాంతాలకు 22 జతల రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. రెగ్యులర్‌ రైళ్లను పునరుద్ధరించకుండా దశలవారీగా ప్రత్యేక రైళ్లనే అన్ని రూట్లలో నడుపుతున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల గుండా రాకపోకలు సాగిస్తారు. రోజుకు 200లకు పైగా రైళ్లు ఈ మూడు స్టేషన్ల నుంచి నడుస్తాయి. కానీ కరోనా కారణంగా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు..

ప్రతి సంవత్సరం సంక్రాంతి రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే వందల రైళ్లను ప్రత్యేకంగా నడుపుతూ వస్తుంది. కానీ ఇప్పుడు 64 రైళ్లను మాత్రమే పెంచారు. కోవిడ్‌ ఆంక్షల కారణంగా రైళ్లను భారీగా తగ్గించడంతో మధ్యతరగతి, కిందిస్థాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సొంతూరుకు వెళ్లాలంటే.. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు కిటకిటలాడే పరిస్థితి. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు.. దొరికిందే సందుగా టిక్కెట్ల రేట్లను భారీగా పెంచేశారు. ఒక ట్రావెల్స్‌కు, మరో ట్రావెల్స్‌కు మధ్య పొంతన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు. దీంతో చాలా మందికి పండుగ ప్రయాణం కష్టతరం అయిపోయింది. పిల్లలు, పెద్దలు, మహిళలు మరింత ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక కోసం నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించుకోలేక ఇళ్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు.

విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్‌ వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున వెళ్తుంటారు. మరోవైపు సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లే వారిపై అప్పుడే ప్రైవేటు బస్సులు ఛార్జీల బాదుడు మొదలుపెట్టాయి. పండగకు ముందు మూడు రోజులు ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను ఇప్పటికే రెట్టింపు చేసేశాయి. దొరికిన కాడికి కాసులు దండుకునేందుకు సిద్ధమైపోయాయి.