తీహార్ జైలుకి సోనియా…డీకే శివకుమార్ కు బెయిల్

తీహార్ జైలుకి సోనియా…డీకే శివకుమార్ కు బెయిల్

తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయిల్ బాండ్ తో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శివకుమార్ దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. 

దర్యాప్తు సంస్థల దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నందున శివాకుమార్ సాక్ష్యాలను నాశనం చేయలేడని, అతను సాక్షులను ప్రభావితం చేశాడని చూపించడానికి ఎటువంటి మెటీరియల్ లేదని శివకుమార్ కి బెయిల్ మంజూరు చేసే సమయంలో జస్టిస్ సురేష్ కైట్ తెలిపారు.  

అంతకుముందు ఇవాళ ఉదయం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ,ఎంపీ అంబికా సోని తీహార్ జైలుకి వెళ్లి శివకుమార్ ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ కూడా వారి వెంట ఉన్నారు. ఇదొక రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టిన కేసు అని సోనియా అన్నారని డీకే సురేష్ తెలిపారు.