జల్లికట్టు : తమిళనాడులో 64 ప్రాంతాల్లో అనుమతి

జల్లికట్టుకు సిధ్దమైన తమిళ తంబీలు

  • Edited By: chvmurthy , January 13, 2019 / 04:04 PM IST
జల్లికట్టు : తమిళనాడులో 64 ప్రాంతాల్లో అనుమతి

జల్లికట్టుకు సిధ్దమైన తమిళ తంబీలు

సంక్రాంతి పండుగనగానే రాష్ట్రమేదైనా, భాష ఏదైనా, ప్రజలు ఆనందోత్సాహలతో చేసుకుంటారు. ప్రాంతాల వారీగా తేడాలుంటాయేమో కానీ ఆనందంలో తేడా ఉండదు. ఇంట్లో వండుకునే పిండి వంటలు, పిల్లా, పాపల ఆట, పాటలు, భోగి మంటలు,భోగి పళ్లు, సంక్రాంతి బొమ్మల కొలువులు ఒక ఎత్తైతే, తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు, తమిళ రాష్ట్రంలో జల్లికట్టు ఆడితే వచ్చే కిక్కే వేరప్పా .. 
ఏపీలో కోడిపందాలుపై పోలీసులు, నిర్వాహకుల మధ్య వివాదాలు నడుస్తుండగా పొరుగున ఉన్న తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రాంతాల్లోజల్లి కట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి  ఇవ్వటంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు. సంక్రాంతి పండుగ రోజుల్లో తమిళ సంప్రదాయ సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను నిర్వహించడం తమిళనాట ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా మదురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు అనేక గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా జల్లికట్టు నిర్వహణకు పేరొందిన అవనియాపురంలో సంక్రాంతి రోజున, కానుం పొంగల్‌ రోజున పాలమేడులో, మూడో రోజున అలంగనల్లూరులో ఈ పోటీలు యువతీ, యువకులు కేరింతల మధ్య ఆనందోత్సాలతో  వీరోచితంగా జరుగుతాయి. 
జల్లికట్టు తిలకించేందుకు వివిధప్రాంతాల నుంచి ప్రజలు  అవనియపురానికి చేరుకుంటున్నారు. జల్లికట్టులో పాల్గోనేందుకు 3,400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.2,600 ఎద్దులు ఈసారి  జల్లి కట్టులో పాల్గోంటున్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లాలోని బందారుపల్లిలో శనివారం జల్లికట్టు నిర్వహించారు.