ఆదివారం జనతా కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2020 / 03:23 PM IST
ఆదివారం జనతా  కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాను ఇకపై తేలిగ్గా తీసుకోలేదని, బాధితులను ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కరోనాతో పోరాడటానికి సరైన సంకల్పంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలని  మోదీ పిలుపునిచ్చారు. స్వయంగా ఆరోగ్యంగా ఉండటం అంటే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడమేనని ప్రధాని మోదీ తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే..ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.

మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదని, కానీ నేడు కరోనా వైరస్‌ మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ సంకట స్థితిలోకి నెట్టేసిందని ప్రధాని తెలిపారు. ప్రకృతి విపత్తులు ఏర్పడిన సందర్భంలో కొన్ని ప్రాంతాలే ప్రభావితం చెందుతాయి కానీ, కరోనాతో మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయని అన్నారు. ఆదివారం (మార్చి-22,2020)దేశప్రజలెవరూ ఇళ్లల్లోనుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి  రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం అని మోడీ పిలుపునిచ్చారు. ఆ రోజు 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి,  కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలని మోడీ చెప్పారు.

కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. నిత్యావసరాలు, అత్యవసర మందుల కొరత రాదు, ఈ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదన్నారు. భారత్‌ పై  కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పు అన్న మోడీ…గ్రూపులుగా తిరగవద్దు. స్వీయ నియంత్రణ అవసరం అన్నారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండాలని మోడీ సూచించారు. కరోనాను అరికట్టేందుకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పడే ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. అందరం చేయి చేయి కలిపి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా కబలిస్తున్న దేశాల్లో మొదట బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నా..రాను రాను సంఖ్య పెరిగిపోతుందని ప్రధాని అన్నారు. 

ఒంటరిగా ఉండటంతో కరోనాకు చెక్‌
వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. సంకల్పం, కనీస జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు. ఎవరికి వారు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లే.. కరోనా నివారణకు ప్రపంచదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒంటరిగా ఉండటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చన్నారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కరోనాను ఎదుర్కొనేందుకు మన ముందున్న మార్గాలు ఒకటి దృఢ సంకల్పం, రెండోది కలిసి పనిచేయడమని మోడీ అన్నారు.

వృద్ధులను బయటకు వెళ్లనీయొద్దు
వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలంతా బాధ్యతలు గుర్తించి మనకు రాకుండా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలని ప్రధాని సూచనలు చేశారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లనీయరాదని సూచించారు. మాకు ఏమీ కాదన్న నిర్లక్ష్యం, నీకే కాకుండా నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికే నష్టమని మోడీ తెలిపారు.