భారత్‌లో బుల్లెట్ రైలు.. ఫోటో విడుదల.. వైరల్!

భారత్‌లో బుల్లెట్ రైలు.. ఫోటో విడుదల.. వైరల్!

ప్రధాని మోడీ ప్రతిష్టాత్మంగా తీసుకుని దేశంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌.. దీనికి సంబంధించిన ఫస్ట్ విజువల్స్‌ను, ఈ-5 సిరీస్ శింకసేన్ పేరుతో ఇండియాలోని జపాన్ రాయబార కార్యాలయం విడుదల చేయగా.. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌ను ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. 2023లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా.. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెప్టెంబర్‌లో టెండర్ ప్రక్రియ నిర్వహించగా.. 24వ తేదీన లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ 1.08 లక్షల కోట్లకు ప్రాజెక్టును దక్కించుకుంది. టాటా ప్రాజెక్ట్స్ పోటీకి వచ్చినా ఈ భారీ ప్రాజెక్టును పొందలేకపోయింది. జపాన్‌ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు (ఎంఏహెచ్‌ఎస్‌ఆర్‌)కు సంబంధించిన ఫస్ట్ విజువల్ విడుదలైంది.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుగా వ్యవహరించే ఈ ప్రాజెక్టును 2023నాటికి పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పొడవు 508 కిలోమీటర్లు. ఈ దూరాన్ని కవర్ చేయడానికి రైలుకు 7 గంటలు పడుతుంది. ఈ ప్రయాణంలో, బుల్లెట్ రైలు సొరంగం కింద నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది, అందులో ఏడు కిలోమీటర్లు సముద్రం కింద ఉంటుంది. ఈ బుల్లెట్ రైలు గరిష్ట వేగ పరిమితి గంటకు 350 కిమీ. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత, బుల్లెట్ రైలు ఉదయం 6 నుండి 12 గంటల వరకు 70 రౌండ్లు (ప్రతి మార్గం 35 రౌండ్లు) వేస్తుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు కవర్ అవుతాయి.

ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు 2017 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే పునాది వేశారు. తైవాన్ తరువాత జపాన్ ఐకానిక్ షింకన్సేన్ బుల్లెట్ రైలును కొనుగోలు చేసిన రెండవ దేశంగా భారత్ నిలిచింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు సుమారు 17 బిలియన్లు. ఈ ప్రాజెక్టును నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) జపాన్ ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 90 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభిస్తాయని భావిస్తున్నారు.