బతికే ఉన్నా ..”అమర” జవాన్ నుంచి భార్యకు ఫోన్

  • Published By: venkaiahnaidu ,Published On : June 18, 2020 / 01:51 PM IST
బతికే ఉన్నా ..”అమర” జవాన్ నుంచి భార్యకు ఫోన్

లడఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి చైనా దళాలతో ముఖాముఖిలో 20 మంది భారతీయ జవాన్లు మృతి చెందినట్లు భారత సైన్యం ధృవీకరించిన విషయం తెలిసిందే. అమరులైన వారిలో బీహార్‌కు చెందిన హవల్దార్‌ సునీల్ కుమార్ కూడా ‌ ఉన్నారు. ఘర్షణలో సునీల్ అమరుడైనట్లు  అతని కుటుంబ సభ్యులకు ఆర్మీ నుంచి సమాచారం అందింది. దీంతో సునీల్ కుటుంబంతో పాటు, గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. 

కానీ, కన్నుమూశాడనుకున్న ఆ జవాన్ నుంచి అతడి భార్యకు బుధవారం (జూన్ 17,2020) ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇంకా బతికే ఉన్నా అంటూ ఆ జవాన్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.   విషాదంలో మునిగిపోయిన గ్రామస్థులు కూడా ఒక్కసారిగా తేరుకున్నారు.

అయితే ఈ గందరగోళానికి కారణం బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పేరు ఒకటే(సునీల్) కావడమే. అంతేకాదు, వారి తండ్రి పేర్లు(సుఖ్‌దేవ్) కూడా ఒకటే. బీహార్‌లోని సరణ్ జిల్లాకు చెందిన జవాన్ సునీల్ రాయ్ లేహ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్ రాయ్. ఇద్దరి జవాన్ల పేరు సునీల్ కావడంతో.. చైనాతో ఘర్షణల్లో మరణించిన సునీల్ కుమార్‌కు బదులుగా సునీల్ రాయ్‌ కుటుంబానికి ఇండియన్ ఆర్మీ నుంచి సమాచారం వెళ్లింది. దీంతో గందరగోళం నెలకొంది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సునీల్ రాయ్.. వెంటనే తన భార్య మేనకకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు.

నా భర్త ఇకలేడనే వార్తతో కుంగిపోయా. కానీ, ఆయన నుంచి ఫోన్ రావడంతో ప్రాణం లేచి వచ్చింది. ఆ భగవంతుడు నాకు కొత్త జీవితం ప్రసాదించాడు’ అని సైనికుడు సునీల్ రాయ్ సతీమణి మేనక తెలిపారు. చైనా సరిహద్దులో అమరులైన జవాన్లలో బీహార్ రాష్ట్రం నుంచి ముగ్గురు ఉన్నారు. బిహతాకు చెందిన సునీల్ కుమార్, సమస్తిపూర్‌కు చెందిన అమన్ సింగ్, సహస్రకు చెందిన కుందన్ కుమార్ వీర మరణం పొందారు.

గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘రెడ్‌ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్‌-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు సరిహద్దు వివాదంపై చర్చించేందుకు గురువారం సమావేశమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి.