8 నెలలుగా మంచు కిందే జవాన్ మృతదేహం…ఆగస్టు 15న గుర్తించిన అధికారులు

  • Published By: bheemraj ,Published On : August 16, 2020 / 09:30 PM IST
8 నెలలుగా మంచు కిందే జవాన్ మృతదేహం…ఆగస్టు 15న గుర్తించిన అధికారులు

జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్‌ హవల్దర్ రాజేంద్ర సింగ్‌ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు.



ఈ విషయాన్ని నేగి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భారత సైన్యానికి చెందిన 11 గర్హ్వాల్ రైఫిల్స్‌కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు.



నేగి మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్‌లో అతన్ని ‘అమరవీరుడు’గా ప్రకటించి, ఈ విషయాన్ని జూన్ 21న నేగి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి నేగిని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది.



తన భర్త మృతదేహాన్ని కళ్లతో చూసే వరకు అతను మరణించినట్లు భావించనని ఆమె తేల్చి చెప్పారు. డెహ్రాడూన్‌కు చెందిన నేగి..2001లో సైన్యంలో చేరారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.



శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేగి మృతదేహం లభించిన విషయాన్ని ఆతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నేగి మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.